Let's talk: editor@tmv.in
పల్లెల నుండి ప్రపంచ వేదికకు.. భారత యువ హాకీ జట్టు!

పల్లెల నుండి ప్రపంచ వేదికకు.. భారత యువ హాకీ జట్టు!

Praveen Kumar
13 డిసెంబర్, 2025

భారత్ జూనియర్ పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్‌లో కంచు పతకం సాధించడం దేశ హాకీకి కొత్త ఊపు తీసుకొచ్చింది. తొమ్మిది ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పతకం వెనకాల చిన్నపల్లెల నుంచి వచ్చిన కష్టాలు, త్యాగాలు, భయాలు, ఆశలు కలిసి నడిపిన యువ ఆటగాళ్ల కథలు ఉన్నాయి. ఒకరి కథ మరొకరిది కాకపోయినా, అందరినీ కలిపేది ఒకే స్వప్నం భారతానికి ఒలింపిక్ పతకం తేవాలన్న లక్ష్యం.

ఈ విజయం సీనియర్ జట్టులో రాబోయే తరాల మార్పు కూడా అంత కఠినంగా ఉండదనే నమ్మకానికి బలం చేకూర్చింది. ఈ జట్టులోని ప్రతి యువకుడి ప్రయాణం పోరాటంతో మొదలై పట్టుదలతో విజయం వైపు నడిచింది.

జట్టుకు నాయకత్వం వహించిన హర్యానా, డబ్రా గ్రామానికి చెందిన 21 ఏళ్ల రోహిత్ చిన్నప్పటి నుంచే పేదరికంతో యుద్ధం చేశాడు. సరైన భోజనం దొరకని రోజులు కూడా వున్నాయి. సీనియర్ జట్టుతో సాధన సమయంలో ముఖం పగిలి నెలల తరబడి తినడానికీ తాగడానికీ నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఒక దశలో మళ్లీ ఆడగలనన్న నమ్మకం కూడా కోల్పోయాడు. కానీ కోలుకున్న తర్వాత అతడు మరింత దృఢంగా హాకీ మైదానంలో అడుగుపెట్టాడు. “ఇక భయం లేదు. సీనియర్ జట్టుకి వెళ్లి ప్రపంచకప్, ఒలింపిక్స్‌లో పతకాలు గెలవాలి” అని అంటున్నాడు.

ఒడిశా రాష్ట్రంలోని సుందర్‌గఢ్ జట్టు వెన్నెముకగా నిలిచింది. కేవలం మూడు వేలమంది ఉన్న ఓ చిన్న గ్రామంలో పుట్టిన 19 ఏళ్ల అన్మోల్ ఎక్కడ తన తల్లి చనిపోయిన తర్వాత అమ్మమ్మ–తాతయ్యల వద్ద పెరిగాడు. అక్కడి గ్రామాల్లో హాకీ చాలా ప్రముఖం. హాస్టల్‌లో చేరిన తర్వాత దేశం కోసం ఆడాలన్న సంకల్పం పుట్టింది. అర్జెంటీనాతో కంచు పతక మ్యాచ్‌లో అతడు రాణించడంతో ప్రపంచానికి తెలిసింది.

అదే జిల్లాకు చెందిన 21 ఏళ్ల రోషన్ కుజూర్ చిన్ననాడు గడ్డి మైదానాల్లో స్థానిక టోర్నీలు ఆడాడు. తర్వాతే ఆస్ట్రో టర్ఫ్‌పై ఆడే అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచే ఒలింపియన్ మన్‌ప్రీత్ సింగ్‌ను చూసి మధ్యస్థాన ఆటగాడిగా ఎదిగాడు. “నేను ఇండియా కోసం ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు” అని చెబుతున్నాడు.

పంజాబ్‌లోని పఠాన్కోట్‌కు చెందిన ప్రిన్స్‌దీప్ సింగ్ మొదట ఫుట్‌బాల్ ఆడినా హాకీ వైపు మనసు మళ్లింది. చీమా అకాడమీలో శిక్షణ తీసుకున్న అతడు ఇప్పుడేమో లెజెండరీ పి.ఆర్.శ్రీజేష్ ధరించిన 16 నంబర్ జెర్సీని ధరిస్తున్నాడు. బెల్జియంపై జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతడు చేసిన ఆపకాలే భారత్‌ను ముందుకు తీసుకెళ్లాయి. అర్జెంటీనాతో రెండు గోల్స్ వెనుకబడ్డా, “మన చివరి జూనియర్ టోర్నీ… చివరి వరకు పోరాడాలి” అంటూ జట్టుకి ధైర్యం చెప్పినవాడే అతడు.

పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా వేరోవాల్‌కు చెందిన 20 ఏళ్ల మన్మీత్ సింగ్ ఇంట్లో హాకీ అన్నది ఒక సంప్రదాయం. తండ్రి జాతీయస్థాయిలో ఆడాడు. మామయ్య ఆకాష్‌దీప్ సింగ్ ఒలింపియన్. ఇంకొక బాబాయి పోలీస్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి మన్మీత్ తప్పు చేస్తే ఇంట్లోనే ముందు ప్రశ్నలు వచ్చేవి. ఐదు నెలల బెంగళూరు శిక్షణ ముగించుకుని ఇప్పుడు ఇంటికి వెళ్లి తల్లి చేతి సరీసన్ ద సాగ్, మక్కీ రొట్టి తినాలని ఎదురుచూస్తున్నాడు.

పంజాబ్‌లోని ఘుమన్ కలాన్‌కు చెందిన 20 ఏళ్ల దిల్రాజ్ మొదట్లో హాకీ పట్ల అంత ఆసక్తి చూపలేదు. కానీ ఇంటి కష్టాలు, ముఖ్యంగా తల్లి చేసిన త్యాగాలు అతన్ని మార్చాయి. అనారోగ్యంతో ఉన్న తండ్రి, డబ్బుల్లేని పరిస్థితి… అప్పుడు తల్లి చెవిపోగులు అమ్మి అతనికి తొలి కిట్ కొనిచ్చింది. “మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి ఆమె త్యాగాలు గుర్తొస్తాయి. ఆమెకు మంచి జీవితం ఇవ్వాలని ఉంది” అని భావోద్వేగంగా చెబుతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన డ్రాగ్ ఫ్లికర్ శార్దానంద్ తివారి మళ్లీ మరోసారి బెల్జియంపై కీలక గోల్ కొట్టి 2021 ప్రపంచకప్‌లో ఆడిన ఆటను గుర్తు చేశాడు. 2023 టోర్నీకి ముందు అనారోగ్యంతో వెనుకబడ్డ అతడు ఈసారి అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాడు. “దేవుని పేరు మదిలో తలచుకుంటే నమ్మకం వస్తుంది” అంటాడు.

ఈ యువ జట్టు అందరి ఆలోచన ఒక్కటే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్లాలన్న ధైర్యం. ఏ జట్టునైనా ఓడించగలమన్న నమ్మకం. ఈ పతకం వాళ్ల ప్రయాణానికి ముగింపు కాదు… సీనియర్ స్థాయికి దూసుకెళ్లే ఆరంభం.