Let's talk: editor@tmv.in
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Panthagani Anusha
6 డిసెంబర్, 2025

పల్నాడు జిల్లాలో గురువారం అర్ధరాత్రి జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారి–16 పై ఈ విషాదం చోటుచేసుకుంది.

గురువారం రాత్రి చిలకలూరిపేట కొత్త బైపాస్ వద్ద ముందుగా వెళ్తున్న లారీ వేగం అకస్మాత్తుగా తగ్గించడంతో వెనుక నుంచి వస్తున్న కారు ఆ లారీని ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమై అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా,మిగిలిన ఇద్దరిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇద్దరిలో ఒక విద్యార్ధి చికిత్స పొందుతూ మరణించాడు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కాగా రామిరెడ్డి, శ్రీకాంత్, మహేశ్, కార్తీక్, వాసు అనే ఐదుగురు బీటెక్ విద్యార్థులు దుర్మరణం పాలైనట్లు పోలీసులు గుర్తించారు. మరణించిన వారంతా 20 నుంచి 22 రెండు ఏళ్ల లోపు విద్యార్థులు ఉండటం బాధాకరం . అయితే వీరిలో నలుగురు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండగా మరొకరు గోవిందమాలలో ఉన్నట్లు సమాచారం. అయితే వీరందరూ వినుకొండ మండలం విట్టంరాజు పల్లెకు అయ్యప్ప భజనకు వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రమాదం విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆసుపత్రికి చేరుకుని గాయపడిన విద్యార్థిని పరామర్శించారు. పోలీసులు, వైద్య సిబ్బందితో మాట్లాడి ఘటన వివరాలు సేకరించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ ఇలా ఇలా మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇక మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులు దుర్మరణం పాలవడం హృదయవిదారకం. బాధిత విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలి అని అధికారులను ఆదేశించారు.

మరోవైపు రాత్రి వేళల్లో భారీ వాహనాల నిర్లక్ష్య డ్రైవింగ్, హెడ్‌లైట్ సమస్యలు, బైపాస్ ప్రాంతంలో సరైన సూచిక బోర్డులు లేకపోవడం వంటి అంశాలు ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రహదారి భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.