Let's talk: editor@tmv.in
పల్నాడులో ‘బయోగ్యాస్’ విప్లవం: 200 టన్నుల సామర్థ్యంతో భారీ ప్లాంట్లు

పల్నాడులో ‘బయోగ్యాస్’ విప్లవం: 200 టన్నుల సామర్థ్యంతో భారీ ప్లాంట్లు

Panthagani Anusha
28 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలో స్వచ్ఛ ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పల్నాడు జిల్లాలో భారీ కాంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు క్రోమా-ఏటర్ పవర్ ప్రొడక్ట్స్ సంస్థకు రెవెన్యూ భూములను లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ విడుదల చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో ఈ ప్లాంట్లను స్థాపించనున్నారు. మొత్తం 10 యూనిట్లుగా ఒక్కోటి రోజుకు 20 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం 200 టన్నుల బయోగ్యాస్‌ను తయారు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాబోయే రెండేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.

రాష్ట్రాన్ని దేశంలోనే స్వచ్ఛ ఇంధన హబ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం–2024’ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 160 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 62 శాతం జనాభా సాగుపైనే ఆధారపడి ఉండటంతో బయో ఫ్యూయల్ ఉత్పత్తికి ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. పొలాల్లో వృథాగా పడి ఉండే చెరకు పిప్పి, నూకలు, మక్కజొన్న, స్వీట్ సార్గమ్ వంటి పంట అవశేషాలను ఈ ప్లాంట్లలో ఇంధన తయారీకి ముడిసరుకుగా వినియోగించనున్నారు. దీనివల్ల రైతులకు తమ పంట వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించడమే కాకుండా పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా శిలాజ ఇంధనాలపై (పెట్రోల్, డీజిల్) ఆధారపడటాన్ని తగ్గించి బయో-సీఎన్‌జీ, బయోఎథనాల్ వంటి పర్యావరణ హిత ఇంధనాల వాడకాన్ని పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. కాగా పల్నాడు జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ సీబీజీ ప్లాంట్లు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి పర్యావరణ హిత ఇంధన లక్ష్యాలకు ఒక బలమైన పునాదిగా నిలవనుంది .