
పల్నాడులో పరువు హత్య.. సీఐపై సస్పెన్షన్ వేటు
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలోని ఒక గ్రామంలో యువతి హత్యకు గురైన ఘటనలో విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు, స్థానిక ఇన్‌స్పెక్టర్ (సీఐ) వెంకటరమణపై వేటు వేశారు. నిందితులకు సహకరించడం, లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఆదివారం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. చౌడేశ్వరమ్మ అనే యువతి, నాగరాజు అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. గతంలో వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్ళిపోయారు. ఆ సమయంలో రక్షణ కోరుతూ వారు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే, ఇన్‌స్పెక్టర్ సమక్షంలో యువతి తల్లిదండ్రులు ఒక నాటకమాడారు. నాగరాజుతోనే తమ కుమార్తె పెళ్లి జరిపిస్తామని పోలీసులకు హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మిన చౌడేశ్వరమ్మ తిరిగి తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.
ఇంటికి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత, పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన చౌడేశ్వరమ్మ.. తాను తిరిగి నాగరాజు వద్దకే వెళ్లిపోతానని కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పింది. ఈ క్రమంలో మార్చి 18న ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చౌడేశ్వరమ్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి వాస్తవాలు
ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యగా భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో గొంతు నులిమి హత్య చేశారని వైద్యులు ధృవీకరించారు. దీంతో ఇది ముమ్మాటికీ పరువు హత్య అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఇన్‌స్పెక్టర్‌పై ఆరోపణలు
ఈ కేసులో ఇన్‌స్పెక్టర్ పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. యువతి తండ్రి వద్ద నుంచి ఇన్‌స్పెక్టర్ భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారని, అందుకే ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు రక్షణ కోరినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోవడం, నిందితులతో ఆర్థిక లావాదేవీలు జరపడం వంటి కారణాల వల్ల సదరు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును భారతీయ నాగరిక్ సురక్ష సంహిత కింద నమోదు చేశారు. దర్యాప్తు పురోగతిని బట్టి మరిన్ని సెక్షన్లను జోడించే అవకాశం ఉంది. కన్నకూతురిని పొట్టనబెట్టుకున్న కుటుంబ సభ్యులతో పాటు, వారికి సహకరించిన పోలీసు అధికారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
