
పల్నాడులో అన్నదమ్ముల దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో మరోసారి హింస చెలరేగింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పాత పగల నేపథ్యంలో ప్రణాళిక ప్రకారం దాడి చేసిన దుండగులు వేట కొడవళ్లు, ఇనుప రాడ్లతో వారిని కిరాతకంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
మృతులను టీడీపీ కార్యకర్తలైన కొత్తా హనుమంతరావు, కొత్తా శ్రీరామమూర్తిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ దారుణ హత్యలు గ్రామంలో వేర్వేరు ప్రాంతాల్లో జరగడం ఘటన తీవ్రతను మరింత పెంచింది. గ్రామ శివారులోని ఓ బండరాయి వద్ద హనుమంతరావు మృతదేహం లభించగా, నీలంపేట అమ్మవారి గుడి సమీపంలోని వాటర్ ప్లాంట్ దగ్గర శ్రీరామమూర్తిని హతమార్చారు. పాశవికంగా వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన వై. నరేష్‌తో హత్యాకు గురైనవారరి మధ్య జరిగిన గొడవే ఈ హత్యలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య గొడవ సమయంలో జరిగిన తోపులాటలో నరేష్ తల్లికి రాయి తగలడంతో గాయాలయ్యాయి. దీనికి ప్రతీకారంగా నరేష్ నేతృత్వంలోని గుంపు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నరేష్‌తో పాటు మరో 10 మంది కలిసి ప్రాణాంతక ఆయుధాలతో దాడి చేసినట్లు సమాచారం. అయితే గతంలో గ్రామస్థులు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమికంగా వ్యక్తిగత వైరం ప్రధాన కారణమని భావిస్తున్నప్పటికీ, రాజకీయ కోణం ఉందా అనే అంశాన్ని కూడా పోలీసులు తోసిపుచ్చడం లేదు.
ఈ జంట హత్యల నేపథ్యంలో అడిగొప్పల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు నరేష్‌తో పాటు ఇతర నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఆయన నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టవద్దని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా ఇటీవల సమీపంలోని గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల ఘటన నుంచి జిల్లా ఇంకా కోలుకోకముందే మరోసారి ఇలాంటి హింస జరగడం పల్నాడు వాసుల్లో భయాందోళనలకు కారణమవుతోంది. వరుస హత్యలతో జిల్లా శాంతిభద్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
