Let's talk: editor@tmv.in
పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
23 జులై, 2026

ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద అమలు చేస్తున్న ‘అమరజీవి జలధార’ మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.

బుధవారం పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టుల పనుల వివరాలను వెల్లడించారు. దాదాపు రూ.2,500 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ రెండు మెగా తాగునీటి పథకాలలో, రూ.1,290 కోట్లతో ప్రకాశం జిల్లాలో చేపట్టిన వాటర్ గ్రిడ్ ద్వారా ఏడు నియోజకవర్గాల పరిధిలోని 593 ఆవాసాలకు తాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టులో ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. 119 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ల నిర్మాణం కొనసాగుతోందని, ఇప్పటికే 53 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తయిందని వివరించారు.

అలాగే రూ.1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 152 కిలోమీటర్ల పైప్‌లైన్ నెట్‌వర్క్ పూర్తి కాగా, ఇంటేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. ఇప్పటివరకు రూ.95 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పల్నాడు, ప్రకాశం ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు ఈ మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు శాశ్వత పరిష్కారంగా నిలుస్తాయని అన్నారు. గ్రామాల మధ్య పైప్‌లైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు వంటి అడ్డంకులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేసిన ఆయన, భుజం శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతను పరిశీలిస్తానని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల్లో 16 లక్షల మందికిపైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించగలమని పవన్ పేర్కొన్నారు.