
పాలస్తీనా దేశం ఉండబోదు
ఇకపై పాలస్తీనా దేశం ఉండబోదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు గుర్తింపునిస్తున్న దేశాలకు బలమైన సమాధానం చెప్తామని హెచ్చరించారు. నెతన్యాహు తన క్యాబినెట్ సమావేశంలో చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనా దేశంగా ఉండబోదని, స్పష్టం చేసిన నెతన్యాహు, అక్టోబర్ 7, 2023 హమాస్ దాడి తర్వాత పాలస్తీనాను గుర్తించిన దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రకటన ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణలో కొత్త ఉద్రిక్తతలను సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం తర్వాత మరింత బలమైన చర్యలు తీసుకుంటామని నెతన్యాహు ప్రకటించడంపై తీవ్ర ఆందోళన నెలకొంది.
ఐరాస సమావేశాల వేళ చర్చ
పాలస్తీనా గుర్తింపును వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా నెతన్యాహు ఇజ్రాయెల్ మధ్యలో తీవ్రవాద దేశాన్ని ఏర్పరచడానికి ఎవరైనా బలవంతం చేస్తే, అలాంటి ప్రయత్నాలకు తట్టుకొని నిలబడతామన్నారు. అక్టోబర్ 7, 2023 తర్వాత హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిందని, పలువురిని హత్య చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యల తర్వాత పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించే నాయకులను హెచ్చరించారు. ఆయా నాయకులు తీవ్రవాదానికి బహుమతి ఇస్తున్నారని విమర్శించారు. జోర్డాన్ నది పశ్చిమాన పాలస్తీనా దేశం ఏర్పడదని, ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నో ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. వెస్ట్ బ్యాంక్‌లోని జూడియా, సమారియా ప్రాంతాల్లో యూదు నివాసాల సంఖ్యను రెండింతలు చేశామని, ఈ విధంగా ముందుకు సాగుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అమెరికా పర్యటన తర్వాత దీనిపై స్పందిస్తామన్నారు. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ హెచ్చరించారు. ఈ ప్రకటన ఐక్యా రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రావడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశాల్లో పాలస్తీనా గుర్తింపు గురించి చర్చించే అవకాశం ఉంది.
పెరుగుతున్న దేశాల సంఖ్య
అక్టోబర్ 7 దాడి తర్వాత పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించే దేశాల సంఖ్య పెరిగింది. ఇటీవల బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఫ్రాన్స్, బెల్జియం వంటి దేశాలు కూడా ఐరాసలో ఈ దిశగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 151 ఐరాస సభ్య దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. భారత్ 1988లోనే పాలస్తీనాను దేశంగా గుర్తించింది. పాలస్తీన్ అథారిటీ ప్రెసిడెంట్ పోర్క్‌స్పోక్స్‌మన్ నబీల్ అబు రుదైనా ఈ గుర్తింపులు శాంతికి మార్గమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ వ్యాఖ్యలు అంతర్జాతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని, ఈ చర్యలు ప్రాంతాన్ని అగాథానికి నడిపిస్తాయని విమర్శించారు. ఇజ్రాయెల్, అమెరికా, వారి మిత్రదేశాలు సహా సుమారు 40కి పైగా దేశాలు పాలస్తీనాను గుర్తించడం లేదు. ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, ఆఫ్రికాలో కెమరూన్, లాటిన్ అమెరికాలో పనామా, ఓషియానియాలో చాలా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇజ్రాయెల్ తదుపరి వ్యూహమేంటి?
నెతన్యాహూ ప్రకటన పాలస్తీనా గుర్తింపులో ఇజ్రాయెల్ కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్ చర్యలు పాలస్తీనా గుర్తింపునకు అవకాశం లేకుండా చేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం సైతం ఇజ్రాయెల్ ఆక్రమణ చట్టవిరుద్ధమని ప్రకటించింది. సత్వరమే దాడులను ఆపాలని ఆదేశించింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతున్నా యూరప్ దేశాలు పాలస్తీనా గుర్తింపు కోసం ముందుకు రావడం అభినందించదగ్గ విషయం. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ గాజాపై దాడులను మరింత తీవ్రం చేస్తుందేమోనన్న అనుమానం వ్యక్తం అవుతోంది. నెతన్యాహు ఐరాసలో సైతం దీనిపై పోరాడతామని చెప్పడంతో, ఇజ్రాయెల్ భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆందోళన నెలకొంది. ఈ సంఘర్షణ ప్రాంతీయ శాంతిని మరింత దెబ్బతీస్తుందా? లేక కొత్త చర్చలకు దారితీస్తుందా? అనేది వేచి చూడాలి.
