
పాలస్తీనా గుర్తింపు వెనక ప్రపంచ దేశాల వ్యూహమేంటి?
గాజాను పూర్తిగా ఆక్రమించుకునేదిశగా యుద్ధాన్ని అంతకంతకూ తీవ్రతరం చేస్తోంది ఇజ్రాయెల్. అందుకు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తోంది. మరో పక్క ప్రపంచంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పాలస్తీనాను ఓ దేశంగా గుర్తించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశాలు పోటీపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన దేశాలు, ఒకప్పుడు ఇజ్రాయెల్‌కు కీలక మద్దతుగా ఉన్న దేశాలు సైతం పాలస్తీనాను గుర్తించడం సరికొత్త సంచలనం. గతంలో ఇజ్రాయెల్ దూకుడు వ్యవహారశైలితోపాటు రెండేళ్లగా గాజాలో సాగిస్తున్న మారణహోమంతో విసిగిపోయి దేశాలు ఇలా చేస్తున్నాయా లేక ఇది కూడా ఏమైనా వ్యూహంలో భాగమా?
పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తున్నట్టు కెనడా, ఆస్ట్రేలియా, యూకే ప్రకటించాయి. పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన తొలి జీ7దేశం కెనడా. నెలన్నర రోజుల క్రితం పాలస్తీనాను గుర్తిస్తూ ఫ్రాన్స్ తీసుకున్న కీలకనిర్ణయం కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా అదే దారిలో నడవాల్సిన పరిస్థితులు కల్పించాయి. బెల్జియం కూడా పాలస్తీనాను గుర్తిస్తామని హామీ ఇచ్చింది. ఈ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తూ శాంతి, రెండు దేశాలు అనే మాటలు మాట్లాడుతున్నాయి. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు దేశాలుగా శాంతియుతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాయి. సహజంగానే ఇజ్రాయెల్‌కు ఇది రుచించలేదు. ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనలు చేస్తున్నారు. ఇది శాంతిని కల్పించదని ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరపరుస్తుందని, యూదు వ్యతిరేక చర్యలకు ప్రోత్సాహం ఇస్తుందని హెచ్చరిస్తున్నారు.
పాలస్తీనా మాత్రం అంతర్జాతీయంగా లభిస్తున్న అనూహ్య మద్దతుతో కొంత నైతిక బలం సాధించినట్టు కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌కు సహజ మిత్రులైన కొన్ని యూరప్ దేశాలు, కెనడా, ఆస్ట్రేలియా పాలస్తీనాను గుర్తించడాన్ని అద్భుతంగా కొందరు పౌరులు అభివర్ణిస్తున్నారు. మొత్తంగా పాలస్తీనాను గుర్తిస్తున్నదేశాల సంఖ్య 150దాటింది. పాలస్తీనా ఇంత బలంగా ఇంతకుముందెప్పుడూ లేదని అక్కడి నిపుణులు అంటున్నారు. అయితే పాలస్తీనాను ఇప్పటికిప్పుడు ఓ దేశంగా గుర్తించడం ద్వారా ఏ ప్రయోజనం కలుగుతుందనేదానిపై స్పష్టత లేదు.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం ఇజ్రాయెల్‌ను ఏర్పాటుచేసినప్పటినుంచి ఉంది. పాలస్తీనా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ముస్లింల ఆధీనంలో ఉండేవి. హిట్లర్ యూదులను లక్ష్యంగా చేసుకుని మారణహోమం సాగిస్తున్న కాలంలోనూ, అంతకుముందు, జర్మనీతో పాటు అనేక దేశాల్లో యూదులపై దాడులు పెరుగుతున్న సమయంలో వాటినుంచి తప్పించుకునేందుకు అనేకమంది యూదులు పాలస్తీనా ప్రాంతానికి వచ్చారు. ఆ తర్వాత వారి సంఖ్య పెరగడంతో స్థానికంగా ఉండే ముస్లింలకు, వారికి మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1948లో ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటుచేసుకుంటున్నట్టు యూదులు ప్రకటించడం, అమెరికా, బ్రిటన్ వంటివి
యూదు అనుకూలదేశాలన్నీ మద్దతు తెలపడంతో అంతర్జాతీయంగా ఓ సంక్షోభం మొదలయింది. ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతంలో యూదులకు దేశం ఏర్పాటుచేయడాన్ని ముస్లిం ప్రాబల్యమున్న దేశాలతో పాటు అనేక దేశాలు ఖండించాయి. కానీ తర్వాతతర్వాత ఇజ్రాయెల్ అక్కడ పాతుకుపోయింది. ఇజ్రాయెల్ ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఓటమితో పాలస్తీనాకు కష్టాలు మొదలయ్యాయి. వలసలు, శరణార్థి శిబిరాలు అక్కడ నిత్యకృత్యమయ్యాయి.
పాశ్చాత్య దేశాల మద్దతుతో 1956,1967లో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయెల్ విజయం సాధించడం, తర్వాత కూడా ఆశించిన స్థాయిలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పై పై చేయి సాధించలేకపోవడంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్‌కు ఎదురేలేకుండా పోయింది. చివరకు అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లిపాయాయి. అమెరికాతో పాటు పాశ్చాత్యదేశాల బలమైన మద్దతు, తమ దేశాన్ని కాపాడుకోవాలన్న యూదుల గట్టి సంకల్పం, అభివృద్ధి, ఆయుధ, ఆర్థికసాయం అన్నీ కలిసి ఇజ్రాయెల్‌ను బలమైన శక్తిగా నిలబెట్టాయి. అదే సమయంలో పాలస్తీనా పరిస్థితి మాత్రం అంతకంతకూ దిగజారుతూ వచ్చింది.
మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత తూర్పు జెరూసలేం, వెస్ట్‌బ్యాంక్, గాజా స్ట్రిప్ కలిసి ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనాగా వ్యవహరించేవారు. అయితే జెరూసలేంను ఇజ్రాయెల్ చాలావరకు ఆక్రమించేసుకుంది. వెస్ట్ బ్యాంక్‌లోనూ పెద్ద ఎత్తున యూదుల సెటిల్‌మెంట్లు ఉన్నాయి. జెరూసలేంను ఇజ్రాయెల్ తమ రాజధానిగా ప్రకటించుకుంది. దీన్ని అమెరికా కూడా గుర్తించింది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో అమెరికా ఇజ్రాయెల్‌లోని తన రాయబార కార్యాలయాన్ని టెల్అవీన్ నుంచి జెరూసలేంకు మార్చుకుంది. ఇజ్రాయెల్ మొత్తం ఏకతాటిపై ఉండడం, దేశమంతా ఒకే నాయకత్వం పాలన సాగించడం, అమెరికా, పాశ్చాత్య దేశాల మద్దతుతో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ప్రధానశక్తిగా మారగా, సొంత ప్రాంతంలో పాలస్తీనా మాత్రం అస్తిత్వం కోసం దశాబ్దాలుగా పోరాడాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. అంతర్గత కలహాలు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో నాయకత్వం ఉండడం, రాజకీయ విభేదాలు, అన్నివిధాలా అండగా నిలబడేవారు కరువై పాలస్తీనా ప్రపంచ పటం నుంచి కనుమరుగువుతుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది.
1994లో ఇజ్రాయెల్, పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పాలస్తీనా అధారిటీ లేదా పీఏ ఏర్పడింది. గాజా, వెస్ట్ బ్యాంక్‌పై దీనికి నియంత్రణ ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్‌తో ఒప్పందాలను వ్యతిరేకించే హమాస్, 2007లో గాజాను నియంత్రణలోకి తీసుకుంది. అప్పటినుంచి గాజా హమాస్ ఆధీనంలోనే ఉంది. ఇజ్రాయెల్‌కు, హమాస్‌కు మధ్య ఘర్షణలు నిరంతరం జరుగుతున్నాయి. ప్రస్తుతం పాలస్తీనా అధారిటీకీ మహమ్మద్ అబ్బాస్ నాయకత్వం వహిస్తున్నారు. 1967లో జరిగిన యుద్ధం తర్వాత యాసర్ అరాఫత్ నేతృత్వంలో ఫతా వంటి సంస్థలు పాలస్తీనా విముక్తి సంస్థ పీఎల్ఓను ఏర్పాటుచేశాయి. పాలస్తీనాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నేత, ఓ చేత్తో కత్తి, మరో చేత్తో పావురం పట్టుకుని ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించి పాలస్తీనా గొంతును బలంగా వినిపిపించిన నేత యాసర్ అరాఫత్. పాలస్తీనాలోని అన్ని ప్రాంతాల్లో ఆయన నాయకత్వానికి గౌరవం ఉంది. యాసర్ అరాఫత్ మరణం తర్వాత పాలస్తీనా భూభాగం నుంచి ఆ స్థాయి నాయకుడు ఎదగలేదు. ఇది అక్కడి రాజకీయలక్ష్యాలనే కాదు, ప్రజల కనీస అవసరాలకు ఆటంకంగా మారింది.
2023 అక్టోబరులో హమాస్ చేసిన దాడిని సాకుగా చూపుతూ గాజాలో ఇజ్రాయెల్ రెండేళ్లగా నరమేధం సృష్టిస్తోంది. గాజాను పూర్తిగా ఆక్రమించేదిశగా కదులుతోంది. హమాస్‌పై యుద్ధానికి ముందు కూడా గాజా ప్రజలు ఆంక్షల మధ్యే జీవించారు. జల, వాయు, భూ రవాణా మార్గాలన్నింటిపై ఇజ్రాయెల్ ఆధిపత్యముండేది. అందుకే గాజాను ప్రపంచంలోనే ఓపెన్ ఎయిర్ జైలుగా భావిస్తారు. 2023 తర్వాత పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. ఆకలి కేకలు, చావులు, వలసలతో గాజా ఎన్నడూ కోలుకోలేని స్థాయిలో దెబ్బతింది. ఇంకా ఇజ్రాయెల్ దాహం తీరలేదు. ఈ నరమేధాన్ని చూసి చలించే కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మనసు మార్చుకున్నాయా లేక పనిలో పనిగా గాజాను ఇజ్రాయెల్ కు అప్పగించడమే పాలస్తీనాను దేశంగా గుర్తించడం వెనక ఉన్న వ్యూహమా అన్నది తేలాల్సి ఉంది. అన్నిటికన్నా విషాదమేంటంటే గాజాలో ఇంత జరుగుతున్నా పాలస్తీనా అధారిటీ పాలకులు నోరు మెదపకపోవడం. మొత్తంగా విభజించి పాలించే సూత్రమే ఇక్కడా పనిచేసింది. రానున్నరోజుల్లో పశ్చిమాసియా పరిణామాలు ఇంకెలా మారతాయన్నది చూడాల్సి ఉంది.
