
పర్యావరణ పరిరక్షణలో పౌరులు భాగస్వాములు కావాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న మెగా ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్ సోమవారం సందర్శించారు. సర్కిల్–41 (ముషీరాబాద్) పరిధిలోని బాఘ్‌లింగంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ-వేస్ట్ కలెక్షన్ డ్రైవ్‌ను ఆయన పరిశీలించి, అక్కడ చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఈ-వేస్ట్ సేకరణకు ఏర్పాటు చేసిన శిబిరాలు, ప్రత్యేక కౌంటర్లు, వాహనాల పనితీరును నిశితంగా పరిశీలించారు. ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, ఈ-వేస్ట్ సేకరణ ప్రక్రియ ఎలా సాగుతోందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే పాత కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, బ్యాటరీలు తదితర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఏ విధంగా వేరు చేసి, సురక్షితంగా నిల్వ చేసి, శాస్త్రీయ పద్ధతుల్లో పారవేస్తున్నారనే అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
ఈ-వేస్ట్ సేకరణకు ప్రత్యేకంగా నియమించిన వాహనాలు సకాలంలో పనిచేస్తున్నాయా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉన్నాయా అనే విషయాలపై కూడా ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో శానిటేషన్ బృందాలు, ఫీల్డ్ సిబ్బంది చేస్తున్న కృషిని కమిషనర్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ-వేస్ట్‌ను ఇష్టానుసారంగా పారవేయడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, అలాగే మన ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. పాత ఎలక్ట్రానిక్ పరికరాల్లోని హానికర రసాయనాలు నేల, నీరు, గాలిని కలుషితం చేసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ప్రతి పౌరుడు బాధ్యతగా ఆలోచించి, ఈ-వేస్ట్‌ను అధికారికంగా నిర్వహిస్తున్న సేకరణ కేంద్రాలకు మాత్రమే అప్పగించాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న ఈ మెగా ఈ-వేస్ట్ డ్రైవ్‌లో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ వద్ద ఉన్న వినియోగానికి పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సురక్షితంగా అప్పగించాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని, శుభ్రమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
