
పర్యావరణం వర్సెస్ పారిశ్రామీకరణ..ఎన్నాళ్లీ ఘర్షణ?
భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి–పర్యావరణ పరిరక్షణ మధ్య కొనసాగుతున్న ఘర్షణకు ఆరావళి గిరిపర్వత శ్రేణుల్లో జరుగుతున్న గనుల తవ్వకాలపై ఉద్భవించిన ప్రజా నిరసనలు స్పష్టమైన ప్రతీకగా నిలుస్తున్నాయి. గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ పరిసరాల వరకూ విస్తరించిన ఆరావళి పర్వతాలు కేవలం భౌగోళిక నిర్మాణాలు మాత్రమే కావు. అవి ఉత్తర భారతదేశానికి సహజ రక్షణ కవచాలు ఎడారీకరణను అడ్డుకునే గోడలు, భూగర్భ జలాల నిల్వ కేంద్రాలు, వాతావరణ సమతౌల్యాన్ని నిలబెట్టే ప్రకృతి వ్యవస్థలు.
అయితే అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడుల పేరుతో ఈ పర్వత శ్రేణులు నేడు క్రమంగా మాయమవుతున్నాయి. కొండలు తరిగిపోతున్నాయి, రాళ్లు పిండివేయబడుతున్నాయి, నీటి వనరులు ఎండిపోతున్నాయి. దీనికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు రోడ్డెక్కడం కేవలం ఒక ప్రాంతీయ ఉద్యమం కాదు. ఇది దేశం అనుసరిస్తున్న అభివృద్ధి దిశపై ఒక తీవ్రమైన ప్రజాస్వామ్య ప్రశ్న.
చట్టాలున్నాయి… కానీ అమలు ఎక్కడ?
ఆరావళి ప్రాంత ప్రాధాన్యతపై న్యాయవ్యవస్థ ఎన్నోసార్లు స్పష్టంగా మాట్లాడింది. సుప్రీంకోర్టు తీర్పులు, జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) ఆదేశాలు గనుల తవ్వకాలను నియంత్రించాలి, పర్యావరణ సున్నిత ప్రాంతాలను రక్షించాలి అని స్పష్టం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో గనులపై పూర్తిస్థాయి నిషేధాలు కూడా విధించబడ్డాయి.
అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అక్రమ గనుల తవ్వకాలు రాత్రివేళల్లో కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ–కార్పొరేట్ అనుబంధాలు నియంత్రణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయి. పర్యావరణ అనుమతులు ఒక సంతకం ప్రక్రియగా మారిపోయాయి. ప్రజాభిప్రాయ సేకరణలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి.
ఇక్కడే అసలు సమస్య బయటపడుతోంది. పర్యావరణ పరిరక్షణ రాజ్యాంగ బాధ్యతగా కాకుండా అభివృద్ధికి అడ్డంకిగా చూడబడుతోంది. ఆరావళి నిరసనలు ఈ పాలనా వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
ఉపాధి వాదన: నిజమా, ముసుగేనా?
గనుల తవ్వకాలను సమర్థించే వారు ముందుకు తెచ్చే ప్రధాన వాదన—ఉపాధి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ఆర్థిక చలనం పెరుగుతోందని వారు చెబుతారు. కానీ స్థానిక ప్రజల అనుభవం ఈ వాదనను ప్రశ్నిస్తోంది. కొద్ది కాలం పనిచేసే కూలీ పనులు ఒకవైపు ఉంటే, శాశ్వతంగా నష్టపోతున్న వ్యవసాయం, పశుపోషణ, నీటి భద్రత మరోవైపు ఉన్నాయి. భూగర్భ జలాల మట్టాలు పడిపోవడంతో బావులు ఎండిపోతున్నాయి. వేడి తీవ్రత పెరిగి జీవనం కఠినమవుతోంది. మేత భూములు నశించడంతో పశుపోషణ కుదేలవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రశ్న తలెత్తుతోంది కొద్ది సంవత్సరాల ఉపాధి కోసం శతాబ్దాల పాటు ఉపయోగపడే ప్రకృతి వనరులను త్యాగం చేయడం ఎంతవరకు సమంజసం?
తిరిగి రాని నష్టం
గనుల తవ్వకాల వల్ల జరిగే నష్టం ఆర్థిక గణాంకాల్లో కనిపించదు. కొండలు ఒకసారి తరిగిపోతే వాటిని తిరిగి నిర్మించలేం. భూగర్భ జలాలు నశిస్తే వాటిని తిరిగి నింపడం అసాధ్యం. వాతావరణ సమతౌల్యం దెబ్బతింటే దాని ప్రభావాలు తరతరాలపాటు కొనసాగుతాయి. ఈ దృష్టితో చూస్తే, ఆరావళి నిరసనలు అభివృద్ధికి వ్యతిరేకం కావు. అవి భవిష్యత్తు కోసం సాగుతున్న పోరాటాలు.
“సుస్థిర అభివృద్ధి” అనే భ్రమ
భారతదేశంలో విధానపరమైన చర్చల్లో తరచుగా వినిపించే పదం సుస్థిర అభివృద్ధి. ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమాంతరంగా సాగవచ్చని చెప్పే సిద్ధాంతం ఇది. కానీ ఆరావళి వాస్తవ పరిస్థితి ఈ సిద్ధాంతాన్ని కఠినంగా ప్రశ్నిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక అభివృద్ధి మోడల్ అధిక వనరుల దోపిడీ, వేగవంతమైన నగరీకరణ, వినియోగ ఆధారిత మార్కెట్ వ్యవస్థ ఈ మూడు కలిసి పర్యావరణానికి శత్రువులుగా మారాయి. పర్యావరణ ప్రభావ అంచనాలు వేగంగా పూర్తిచేస్తారు. ప్రజా వ్యతిరేకతను అభివృద్ధి వ్యతిరేకతగా ముద్రవేస్తారు. ఈ వ్యవస్థలో సుస్థిరత ఒక నినాదంగా మాత్రమే మిగులుతుంది; ఆచరణలో కాదు.
అసలు మూలం: వినియోగవాదం
ఆరావళి విధ్వంసానికి గనుల కంపెనీలు ప్రత్యక్ష కారణమైతే, అసలు మూలం సమాజంలో పెరిగిన వినియోగవాదం. పెద్ద ఇళ్లు, విస్తరిస్తున్న నగరాలు, నిరంతర నిర్మాణాలు ఇవన్నీ ఎక్కువ రాళ్లు, ఎక్కువ సిమెంట్, ఎక్కువ ఖనిజాలను కోరుతున్నాయి. అభివృద్ధి అంటే ఎక్కువ వినియోగమే అనే భావన మన సమాజాన్ని ఆవరించింది. ఈ డిమాండ్ ఉన్నంత కాలం, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ చట్టం చేసినా ప్రకృతిపై ఒత్తిడి తగ్గదు.
అభివృద్ధి నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరం
ఆరావళి నిరసనలు ఒక మూల ప్రశ్నను మన ముందుంచుతున్నాయి అభివృద్ధి అంటే ఏమిటి? ప్రకృతిని నాశనం చేసి సాధించిన వృద్ధి నిజంగా పురోగతేనా? మన పిల్లలకు నీరు, గాలి, భూమి లేకుండా చేసే అభివృద్ధి ఎవరి కోసం? చట్టాలు కఠినంగా చేయడం, పర్యవేక్షణ పెంచడం తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. వినియోగ ఆధారిత, లాభ కేంద్రిత ఆర్థిక మోడల్ మారకపోతే సమస్య కొనసాగుతూనే ఉంటుంది. గ్రీన్ ట్యాగులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు అసలు గాయంపై వేసే కట్టే తప్ప శాశ్వత చికిత్సలు కావు.
నిరసనల నుంచి ఆత్మపరిశీలనకు
ఆరావళి గిరిపర్వతాల్లో జరుగుతున్న నిరసనలు ఒక ప్రాంతీయ పర్యావరణ ఉద్యమంగా మాత్రమే చూడటం పొరపాటు. ఇవి భారత అభివృద్ధి మోడల్‌పై సాగుతున్న ప్రజా ఆత్మపరిశీలన. ప్రస్తుత ఆర్థిక అభివృద్ధి మోడల్‌లో నిజమైన పర్యావరణ పరిరక్షణ సాధ్యం కాదు. ఈ సంఘర్షణ యాదృచ్ఛికం కాదు; అది వ్యవస్థాగతం. అందుకే పరిష్కారం కోర్టులు, కమిటీలకే పరిమితం కాదు.
వినియోగవాదాన్ని నియంత్రించకుండా, అవసరాలు–లోభం మధ్య తేడాను గుర్తించకుండా, ప్రకృతిని కాపాడలేం. డిమాండ్ తగ్గకపోతే సరఫరా కూడా తగ్గదు. సరఫరా తగ్గకపోతే ఆరావళులు, అడవులు, నదులు క్రమంగా అంతరించిపోతాయి.
ఆరావళి నిరసనలు మనకు ఒక అసౌకర్యకరమైన కానీ తప్పనిసరి సత్యాన్ని చెబుతున్నాయి ప్రకృతిని రక్షించాలంటే ముందుగా మన అభివృద్ధి ఆలోచనను, జీవనశైలిని, వినియోగపు అలవాట్లను మార్చుకోవాల్సిందే. అభివృద్ధి ప్రకృతిని మింగితే, చివరికి అది మనల్నే మింగుతుంది.
