Let's talk: editor@tmv.in
పర్యాటక రంగంలో కొత్త శకం.. గైడ్ వ్యవస్థ బలోపేతంతో యువతకు ఉపాధి: కందుల దుర్గేష్

పర్యాటక రంగంలో కొత్త శకం.. గైడ్ వ్యవస్థ బలోపేతంతో యువతకు ఉపాధి: కందుల దుర్గేష్

Panthagani Anusha
9 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గైడ్ల వ్యవస్థను బలోపేతం చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్వర్ణాంధ్ర పర్యాటక విజన్-2047, పర్యాటక విధానం 2024-29 లక్ష్యాలకు అనుగుణంగా స్టార్టప్‌లు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మన వారసత్వ సంపదను ప్రపంచానికి వివరించే కథకులుగా యువతను తీర్చిదిద్దినప్పుడు స్వయం సమృద్ధి గల పర్యాటక ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో పేర్కొన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. గైడ్లు, టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన పిల్లర్లని, ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వారికి అన్ని విధాలా మద్దతు అందిస్తుందని తెలిపారు.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మరియు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ సమన్వయంతో విజయవాడ-అమరావతి పర్యాటక సర్క్యూట్ కోసం ఇటీవల ప్రత్యేక గైడ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించి సర్టిఫికేషన్ అందజేసింది. ఈ శిక్షణతో పలువురు యువకులు స్వయం ఉపాధి సాధిస్తూ మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా ఎదుగుతున్నారు.

అటువంటి యువకుల్లో అభిరామ్ ఒకరు. ప్రభుత్వ శిక్షణలో పాల్గొని పర్యాటక ప్రాంతాల చారిత్రక నేపథ్యం, పర్యాటకులతో వ్యవహరించే తీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో శిక్షణ పొందిన ఆయన ప్రస్తుతం కొండపల్లి కోట, గాంధీ హిల్, ఉండవల్లి గుహలు, అమరావతి స్తూపం వంటి ప్రదేశాల్లో అంతర్జాతీయ పర్యాటకులకు గైడ్ సేవలు అందిస్తున్నారు. తన ఉపాధితో పాటు స్థానిక యువతకు కూడా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ చిన్న స్థాయి పర్యాటక వ్యవస్థను నిర్వహిస్తున్నారు.

ఇక వారసత్వ, చేనేత పర్యాటక రంగాల్లో కూడా ఈ విధానం విస్తరిస్తోంది. హెరిటేజ్ టూరిజం నిపుణుడు నవల్‌దీప్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి, మచిలీపట్నం, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, బొబ్బిలి, పొందూరు, గోదావరి-కోనసీమ ప్రాంతాలను కలుపుతూ టెక్స్‌టైల్ టూరిజం సర్క్యూట్‌లు నిర్వహిస్తున్నారు. బ్రిటన్, ఇటలీ వంటి దేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అధికారులు తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా ఏపీటీఏ, ర్యాపిడో సంస్థలు కలిసి ‘డ్రైవర్-కమ్-గైడ్’ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాయి. విజయవాడలో 280 మంది ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి, పర్యాటక ప్రాంతాల విశిష్టతను కథల రూపంలో వివరిస్తూ పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించేలా తీర్చిదిద్దారు. ‘జిజ్ఞాస ఆర్ట్‌వర్స్’ భాగస్వామ్యంతో అమరావతి సర్క్యూట్‌లో 20కిపైగా పర్యాటక అనుభవాలను రూపొందించి బుక్ మై షో, గెట్ యువర్ గైడ్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రభుత్వ ప్రోత్సాహం పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి కాట తదితరుల చొరవతో సరైన శిక్షణ అందితే పర్యాటక రంగంలో అద్భుతాలు సాధ్యమని అభిరామ్ వంటి యువకులు నిరూపిస్తున్నారని మంత్రి తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్-2047 దిశగా రాష్ట్రం ముందుకు సాగుతున్న వేళ ఇలాంటి యువ పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా మారుతున్నారని పేర్కొన్నారు.