Let's talk: editor@tmv.in
పర్యాటకరంగంలో త్రిపుర మెరుగైన వృద్ధి

పర్యాటకరంగంలో త్రిపుర మెరుగైన వృద్ధి

Pinjari Chand
2 అక్టోబర్, 2025

దేశ, విదేశీ పర్యాటకుల రాకపోకలతో త్రిపుర గణనీయమైన వృద్ధిని సాధించింది. 2023–24 సంవత్సరాలకు సంబంధించి అత్యధిక పర్యాటకులను ఆకర్షించి ముఖ్యమైన మైలురాయిని పర్యాటక రంగం సాధించింది. అధికారిక సమాచారం ప్రకారం 64.07 శాతం దేశీయ పర్యాటకులు పెరిగారు. 36.15 శాతం విదేశీ పర్యాటకులు త్రిపురలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఎక్కువ మొత్తంలో పెరుగుదలను నమోదు చేశారు. ఈ గణంకాలు రాష్ట్రంలో సందర్శకుల ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. దీంతో త్రిపుర పర్యాటకులకు ఓ గమ్యస్థానంగా మారింది.

2023లో త్రిపురను 0.366 మిలియన్ల దేశీ పర్యాటకులు, 0.067 మిలియన్ల విదేశీ పర్యాటకులు సందర్శించారు. 2024 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగింది. 0.601 మిలియన్ల దేశీ పర్యాటకులు, 0.091 మిలియన్ల విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం తరువాత త్రిపురను అత్యధికంగా సందర్శిస్తున్నారు.

ముఖ్యమంత్రి మాణిక్ సాహా నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషికి, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అంకితభావంతో పని చేస్తుందనడానికి ఈ గణంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దేశ, అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక వారసత్వం, ప్రకృతిని కాపాడడం, మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ముందుకు సాగుతుంది.

ఈసందర్భంగా పర్యాటక శాఖ మంత్రి సుశాంత్ చౌదరి మాట్లాడుతూ గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న వామపక్షాలు పర్యాటక రంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. అలాగే ప్రస్తుతం మా ప్రభుత్వంలో పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, సందర్శకులకు సౌకర్యాలను కల్పిస్తూ పోతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన రంగానికి ఊతం కల్పిస్తున్నామన్నారు. వరుసగా మేం అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నాం. పర్యాటక అధికారులతో కలిసి ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​, మరో మంత్రి జ్యోతిరాదిత్య సిందియాను కలిసి పర్యాటక ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేయాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే కేంద్రం నుంచి తీపి కబురు వస్తుందని భావిస్తున్నామన్నారు.

పర్యాటకరంగంలో త్రిపుర మెరుగైన వృద్ధి - Tholi Paluku