Let's talk: editor@tmv.in
పర్యాటకం రాష్ట్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌: మంత్రి కందుల దుర్గేష్

పర్యాటకం రాష్ట్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌: మంత్రి కందుల దుర్గేష్

Panthagani Anusha
8 నవంబర్, 2025

పర్యాటక రంగం దేశ–రాష్ట్రాల భవిష్యత్తును నిర్దేశించే కీలక శక్తి అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. లండన్‌లో నిర్వహించిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్–2025 ప్రదర్శన ముగిసిన అనంతరం, ఇండియన్ హైకమిషన్ నిర్వహించిన హైటీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. డబ్ల్యుటిఎం వేదికలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇది రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అనువైన అవకాశమని మంత్రి తెలిపారు.

ఏపీకి రావాలని ఆహ్వానం

డబ్ల్యుటిఎం కోసం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పర్యాటక సంస్థల ప్రతినిధులను ఏపీ సందర్శించాలని మంత్రి దుర్గేష్ ఆహ్వానించారు. పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక హోదా కల్పించామని, కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. “ఏపీకి రండి... అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించండి. పర్యాటక, సేవా రంగాల్లో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని ఇన్వెస్టర్లను కోరారు.

12 వేల కోట్ల పెట్టుబడులు

రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటకమే గేమ్ చేంజర్ అని నమ్ముతున్నామన్న ఆయన, చివరి 15 నెలల్లోనే రూ.12 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని వెల్లడించారు. ఎకో, అడ్వెంచర్, బీచ్ టూరిజం రంగాల్లో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వెల్‌నెస్ సెంటర్లు, ఆయుర్వేద కేంద్రాల స్థాపనకు ఏపీ అనువైన గమ్యస్థానమని వివరించారు.

ఎకో టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాజెక్టులకు విద్యుత్ సబ్సిడీలతో పాటు పలు రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు.

పర్యాటక అభివృద్ధిలో ఏపీ దేశానికి మోడల్‌గా మారడమే లక్ష్యమని, ఈ రంగంలో దేశంలో నంబర్ వన్‌గా నిలిచే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.

భారతదేశం విభిన్న జాతులు, మతాలు, సంస్కృతుల సమ్మేళనమని గుర్తుచేసిన మంత్రి దుర్గేష్, ఐకమత్యమే భారత బలం అన్నారు. కార్యక్రమంలో ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు ప్రతిధ్వనించాయి. వికసిత భారత లక్ష్య సాధనలో దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనను పూర్తి చేసిన మంత్రి కందుల దుర్గేష్ ఏపీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

పర్యాటకం రాష్ట్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌: మంత్రి కందుల దుర్గేష్ - Tholi Paluku