Let's talk: editor@tmv.in
పరీక్షలు భారం కాదు.. సంబరాలు: ప్రధాని మోదీ

పరీక్షలు భారం కాదు.. సంబరాలు: ప్రధాని మోదీ

Dantu Vijaya Lakshmi Prasanna
7 ఫిబ్రవరి, 2026

విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఉద్దేశించిన 'పరీక్షా పే చర్చ' 9వ ఎడిషన్ శుక్రవారం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, పరీక్షలను ఒక యుద్ధంలా కాకుండా పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చదువు అనేది కేవలం మార్కుల వేట కాదని, అది జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు.

సొంత శైలిని నమ్మండి

చాలామంది విద్యార్థులు ఇతరుల సలహాల వల్ల గందరగోళానికి గురవుతుంటారని ప్రధాని గుర్తించారు. అందరి సలహాలను వినాలని, కానీ మీ శరీరం, మనస్సుకు సరిపోయే అధ్యయన పద్ధతిని మాత్రమే ఎంచుకోవాలని ఆయన సూచించారు. "ప్రతి ఒక్కరికీ భోజనం చేయడంలో వేర్వేరు అలవాట్లు ఉన్నట్లే, చదువుకోవడంలో కూడా వేర్వేరు శైలులు ఉంటాయి. కొందరు రాత్రిపూట చదివితే, మరికొందరు తెల్లవారుజామున చదువుతారు. మీ సహజ సిద్ధమైన పద్ధతిని వదులుకోవద్దు" అని ప్రధాని హితబోధ చేశారు.

మార్కుల కంటే వ్యక్తిత్వ వికాసం మిన్న

మార్కులపైనే విపరీతమైన ఒత్తిడి పెంచుకుంటున్న నేటి తరాన్ని ప్రధాని సున్నితంగా హెచ్చరించారు. గతేడాది బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థి పేరు ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు 'లేదు' అని సమాధానం ఇవ్వడంతో, మార్కులు అనేవి తాత్కాలికమేనని, జీవితంలో మనం ఎక్కడ నిలబడ్డాం అనేదే శాశ్వత విజయమని ఆయన వివరించారు.

చదువు భారం కాకూడదు

విద్య అనేది ఒక భారంగా అనిపించకూడదని, అందులో మనం పూర్తిస్థాయిలో నిమగ్నమైనప్పుడే విజయం లభిస్తుందని మోదీ అన్నారు. ముక్కలు ముక్కలుగా నేర్చుకునే విద్య ఎప్పటికీ పూర్తి జ్ఞానాన్ని ఇవ్వదని, అది కేవలం పరీక్షలకే పరిమితం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి పాఠం జీవిత పాఠం కావాలని ఆయన ఆకాంక్షించారు.

లక్ష్యాలను నిర్దేశించుకునే విషయంలో విద్యార్థులకు ప్రధాని ఒక సూత్రం చెప్పారు. మన లక్ష్యాలు మనకు అందుబాటులో ఉండాలి, కానీ అవి చాలా సులభంగా దక్కేవిగా ఉండకూడదు. కొంచెం కష్టపడితేనే సాధించేలా ఉన్నప్పుడే మనలోని శ్రమించే గుణం పెరుగుతుందని ఆయన తెలిపారు. ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం (టమ్ ద మైండ్) నేర్చుకోవాలని సూచించారు.

గేమింగ్ కేవలం సరదా కాదు, ఒక నైపుణ్యం:

ఆధునిక కాలంలో గేమింగ్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని ప్రధాని సానుకూల దృక్పథంతో చూశారు. గేమింగ్ అనేది కేవలం కాలక్షేపం కాదని, అది వేగం, అప్రమత్తతను పెంచే ఒక నైపుణ్యం (స్కిల్) అని కొనియాడారు. అయితే, దీనిని ఒక నిర్మాణాత్మకమైన రీతిలో కెరీర్‌గా మలచుకోవాలే తప్ప, గేమింగ్ పేరుతో జూదం వైపు వెళ్లకూడదని ఆయన గట్టిగా హెచ్చరించారు.

టీచర్ల పాత్ర, మార్గదర్శకత్వం:

ఉపాధ్యాయులు కేవలం పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలను మాత్రమే బోధించకూడదని ప్రధాని కోరారు. విద్యార్థిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని పేర్కొన్నారు. విద్యార్థి వేగం కంటే ఉపాధ్యాయుడి వేగం ఒక అడుగు ముందుండాలని, అప్పుడే వారికి సరైన దిశానిర్దేశం చేయగలమని ఆయన వివరించారు.

గతాన్ని వదిలేసి భవిష్యత్తుపై దృష్టి:

పరీక్షల సమయంలో పాత విఫలాల గురించి లేదా గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయవద్దని మోదీ హితవు పలికారు. "నేను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడను, రాబోయే దాని గురించే ఆలోచిస్తాను" అని తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని చెప్పారు.

జీవన నైపుణ్యాల ఆవశ్యకత:

కేవలం పుస్తక జ్ఞానంతోనే జీవితం సంపూర్ణం కాదని, జీవన నైపుణ్యాలు వృత్తిపరమైన నైపుణ్యాలు రెండూ సమానంగా ముఖ్యమని ప్రధాని తెలిపారు. జీవితంలో బ్యాలెన్స్ కోల్పోతే కింద పడిపోతామని, అందుకే చదువుతో పాటు ఆటలు, హాబీలు, విశ్రాంతిని కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మొదటగా విద్యార్థులు అందంగా అలకరించుకున్న అస్సామీ 'గామోసా'లతో ప్రధానికి స్వాగతం పలికారు. విద్యార్థులందరికీ ధైర్యాన్ని నూరిపోస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. పరీక్షలను కేవలం ఒక పరీక్షగా కాకుండా, మనల్ని మనం నిరూపించుకునే ఒక అవకాశంగా భావించి ముందుకు సాగాలని ఆయన అందరినీ ఆశీర్వదించారు.

కాగా, ఈ ఏడాది 'పరీక్షా పే చర్చ' విశేష స్పందన లభించింది. 2018లో సాధారణంగా మొదలైన ఈ కార్యక్రమం, ఇప్పుడు 4.5 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థుల సంభాషణగా నిలిచింది. ఇది గత ఏడాది సృష్టించిన గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా అధిగమించడం విశేషం.

పరీక్షలు భారం కాదు.. సంబరాలు: ప్రధాని మోదీ - Tholi Paluku