Let's talk: editor@tmv.in
పరిహారం ఆలస్యమైతే జరిమానా బాధ్యత యజమానిదే:సుప్రీం

పరిహారం ఆలస్యమైతే జరిమానా బాధ్యత యజమానిదే:సుప్రీం

Pinjari Chand
4 మార్చి, 2026

ఉద్యోగికి చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని ఆలస్యంగా జమ చేస్తే జరిమానా చెల్లించే బాధ్యత యజమానిదేనని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు రూపొందించిన ఎంప్లాయీస్ కంపెన్‌సెషన్ యాక్ట్ 1923, ఒక సామాజిక సంక్షేమ చట్టమని పేర్కొంటూ, దానిని ఉద్యోగుల పక్షాన విశాల దృక్పథంతో వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని తీర్పులో వెల్లడించింది. న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీ.బీ. వరాలే ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 2025 మేలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చింది.

ఘటన నేపథ్యం

ఒక కమర్షియల్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి 2017 ఫిబ్రవరిలో విధుల్లో ఉన్న సమయంలో మరణించాడు. ఆయన కుటుంబ సభ్యులు 1923 చట్టం ప్రకారం ఢిల్లీ కార్మికశాఖ కమిషనర్ వద్ద పరిహారం కోసం దరఖాస్తు చేశారు. 2020 నవంబరులో కమిషనర్, యజమాని-ఉద్యోగి సంబంధం ఉన్నట్లు నిర్ధారించి, విధుల్లోనే మరణం సంభవించిందని పేర్కొంటూ పరిహారం చెల్లించాలని ఆదేశించారు. రూ.7,36,680తో పాటు వడ్డీ చెల్లించాలని నిర్ణయించారు. వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా పాలసీ ఉండటంతో, యజమానికి బీమా సంస్థ నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునే హక్కు ఇచ్చారు. అయితే, ఒక నెలలోపుగా పరిహారం చెల్లించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదని యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. యజమాని స్పందించకపోవడంతో 2021 ఫిబ్రవరిలో కమిషనర్ పరిహారం మొత్తంపై 35 శాతం జరిమానా విధించారు.

హైకోర్టు–సుప్రీంకోర్టు తీర్పులు

ఈ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు నిలబెట్టగా, జరిమానా చెల్లించే బాధ్యతను ఇన్సూరెన్స్ కంపెనీపై మోపింది. దీనిపై ఇన్సూరెన్స్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు పరిశీలనలో, బీమా సంస్థ పరిహారం, వడ్డీ చెల్లింపుపై బాధ్యతను అంగీకరించినప్పటికీ, జరిమానా చెల్లించే బాధ్యత మాత్రం చట్టం ప్రకారం యజమానిదేనని స్పష్టం చేసింది. 1995లో సవరణల ద్వారా అమల్లోకి వచ్చిన సెక్షన్ 4ఏ(3)(బీ) ప్రకారం, పరిహారం మొత్తాన్ని ఒక నెలలోపు చెల్లించడం యజమాని చట్టబద్ధ బాధ్యత అని కోర్టు పేర్కొంది. ఈ బాధ్యతను ఒప్పందాల ద్వారా లేదా ఇతర మార్గాల్లో తప్పించుకోలేరని స్పష్టం చేసింది.

తుది ఆదేశాలు

దీంతో హైకోర్టు ఉత్తర్వును కొంతవరకు రద్దు చేస్తూ, రూ.2,57,838 జరిమానా మొత్తాన్ని యజమాని ఎనిమిది వారాల్లో చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల హక్కులను పరిరక్షించడంలో చట్టాల ఉద్దేశ్యాన్ని గౌరవించడం అత్యంత అవసరమని సుప్రీంకోర్టు తన తీర్పులో మరోసారి స్పష్టం చేసింది.