Let's talk: editor@tmv.in
పరిసరాల పరిశుభ్రతతోనే పల్లె ప్రగతి సాధ్యం: మంత్రి సీతక్క పిలుపు

పరిసరాల పరిశుభ్రతతోనే పల్లె ప్రగతి సాధ్యం: మంత్రి సీతక్క పిలుపు

Gaddamidi Naveen
23 మార్చి, 2026

గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో జరిగిన స్వచ్ఛంద పారిశుధ్య కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొని, పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం సామూహిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌లతో కలిసి ఆమె 'జల మహోత్సవం' ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నీటి వృధా మానవ మనుగడకే ముప్పు అని హెచ్చరించారు. భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, అడవులను, జలవనరులను కాపాడుకోవాలని ప్రజలను కోరారు.

చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, సరైన వ్యర్థ నిర్వహణ విధానాలను పాటించాలని గ్రామస్థులకు సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ, వారిని గౌరవంతో చూడాలని మంత్రి పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆమె తెలిపారు. మహిళా సంఘాలకు రుణాలు అందించి వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అల్పాహారం, భోజనం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పాఠశాల విద్యార్థులకు పాలు అందించే చర్యలు కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు.

పాల కొరతను అధిగమించేందుకు మహిళలు పాడి పరిశ్రమలోకి రావాలని ప్రోత్సహించారు. ఇందిరమ్మ బీమా పథకం కింద రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ప్రమాదవశాత్తు మరణం జరిగితే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.కులమతాలకు అతీతంగా గ్రామాల్లో ఐక్యతను పెంపొందించేందుకు గ్రామ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మాట్లాడుతూ, 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కింద గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని తెలిపారు. వేసవి కాలానికి ముందుగానే తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేసినట్లు, గిరిజన ప్రాంతాల్లో కూడా ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి, అధికారులు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, జల్ మహోత్సవ్ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.