Let's talk: editor@tmv.in
పరిష్కారం ఇంకెప్పుడు?

పరిష్కారం ఇంకెప్పుడు?

FL - SUNL
18 అక్టోబర్, 2025

రాజధానిలో పనులు వేగవంతం అవుతున్న కొద్దీ రైతుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. వేల కోట్లు వెచ్చించి పనులు జరుపుతున్న అధికారులు రైతుల సమస్యపై పెద్దగా స్పందించడం లేదనే ఆగ్రహం వారిలో వ్యక్తమవుతోంది. సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదని, పైగా సిఆర్డిఏలో ప్రతి పనికీ అవినీతి పెరిగిపోయిందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలోనూ ఇవే అంశాలను వారు ప్రస్తావించారు. సిఆర్డిఏ కార్యాలయంలో ఏ చిన్న పనిచేయాలన్నా డబ్బు ముట్టజెప్పందే పని కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పద్ధతి కొనసాగితే పది రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రైతులకు పూలింగుకు ఇవ్వని భూముల్లోనూ, జాతీయ రహదారికి కేటాయించిన స్థలంలోనూ ప్లాట్లు వేసి ఇచ్చారని, వాటిని మార్చమంటే మార్చడం లేదని చెబుతున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఇదే అంశాన్ని చెబుతున్నా పరిష్కారానికి చర్యలు తీసుకోడం లేదని పేర్కొన్నారు. తాము నిజాయితీగా భూములు ఇచ్చామని, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్ధం కావడం లేదని పేర్కొంటున్నారు.

అలాగే మాస్టర్లనులో వీధిపోట్లు వచ్చిన ప్లాట్లను లాటరీలో మినహాయించకుండా రైతులకు కేటాయించారని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతులు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. తమ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు కూడా చేశారని, ప్లాటు వద్దకు వెళితే భూ యజమాని ఊరుకోవడం లేదని చెబుతున్నారు. వీధిపోట్లు ప్లాట్లకు లాటరీ నిర్వహించొద్దని, వాటిని ప్రభుత్వమే ఉంచుకోవాలని గతంలో రైతులు అనేకసార్లు సూచించినా సిఆర్డిఏ అధికారులు పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామకంఠాల సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని, వాటినీ పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసమస్యలపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనీస స్పందన లేదని ఇటీవల జరిగిన జెఎసి సమావేశంలో రైతులు మండిపడ్డారు. సిఆర్డిఏ కార్యాలయంలో ఏ వినతిపత్రం సమర్పించినా వాటి పరిష్కారానికి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇదెంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు.

ముగ్గురు సభ్యుల కమిటీతో పరిష్కారమయ్యేనా ?

రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నారు. 2024లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పర్యాయాలు వారికి వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నామని, ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమి ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించి తమ వినతులు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.