
పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలి:ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చడమే ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం చిత్తూరు నగరంలో పర్యటించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర' అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని అది ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలని పిలుపునిచ్చారు. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం కలుష్య రహితంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
మార్చి నాటికి 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు
గత ఐదేళ్ల అస్తవ్యస్త పాలన వల్ల రాష్ట్రంలో పేరుకుపోయిన 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను 2026 మార్చి నాటికి పూర్తిగా తొలగిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అదేవిదంగా గత ప్రభుత్వ హయాంలో ఇసుక, మైనింగ్, మద్యం రంగాల్లో దోపిడీ జరగడం వల్ల పర్యావరణం దెబ్బతిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితులను చక్కదిద్దుతున్నామని అందులో భాగంగానే 110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ల కోసం రూ. 510 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లు పనిచేస్తున్నాయని, త్వరలో విజయవాడ, రాజమండ్రిలో మరో రెండు యూనిట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
స్వచ్ఛ రథాలు.. సర్క్యులర్ ఎకానమీకి శ్రీకారం
చెత్తను సంపదగా మార్చే 'సర్క్యులర్ ఎకానమీ' విధానానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చంద్రబాబు వివరించారు. ప్లాస్టిక్, ఇ-వేస్ట్ సేకరణ కోసం ప్రస్తుతం 130 స్వచ్ఛ రథాలను ప్రారంభించామని 2026 మార్చి నాటికి వీటి సంఖ్యను 660కి పెంచుతామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణను మెరుగుపరిచేందుకు ఇ-ఆటోలు, ట్రై సైకిళ్లు, పుష్ కార్డులను భారీగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.మరోవైపు పాఠశాలల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రారంభించిన ‘ముస్తాబు’ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచుతుందని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన ముద్దుకృష్ణమ నాయుడు చివరి శ్వాస వరకు ప్రజా సేవకే అంకితమయ్యారని కొనియాడారు. చిత్తూరు ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. కాగా సభకు ముందు ముఖ్యమంత్రి పేదలకు పెన్షన్లను పంపిణీ చేయడంతో పాటు, మహిళా సంఘాలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను, నాన్-రీసైక్లబుల్ ప్లాస్టిక్‌ను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చే ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీలించారు.
అయితే ప్రతి నెల మూడో శనివారం ఒక ప్రత్యేక అంశంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎం తెలిపారు. అదేవిధంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పరిశుభ్రత అనే మూడు సూత్రాలతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
