Let's talk: editor@tmv.in
పరిగిలో కొత్త ఐటీసీ భవనానికి శంకుస్థాపన: మంత్రి వివేక్

పరిగిలో కొత్త ఐటీసీ భవనానికి శంకుస్థాపన: మంత్రి వివేక్

Gaddamidi Naveen
14 డిసెంబర్, 2025

వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. పరిగి మండలంలోని నస్కల్ గ్రామంలో కొత్త ఐటీసీ భవన నిర్మాణానికి శ‌నివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక, గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి సహా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి ముందు గ్రామ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయాలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐటీసీ భవన నిర్మాణంతో నస్కల్ గ్రామంతో పాటు పరిగి నియోజకవర్గంలో అభివృద్ధి వేగం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని చెప్పారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోందని, ప్రతి గ్రామం సమగ్రంగా ఎదగాలన్నదే తమ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నస్కల్ గ్రామానికి ఐటీసీ భవనం రావడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

పరిగిలో కొత్త ఐటీసీ భవనానికి శంకుస్థాపన: మంత్రి వివేక్ - Tholi Paluku