
‘పరారైన ఆర్థిక నేరస్తులు’గా హిమాచల్ నకిలీ డిగ్రీల సర్టిఫికేట్ కేసు నిందితులు
హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ ల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. షిమ్లాలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (పీఎంఎల్ఏ) కోర్టు, ఆశోని కన్వర్, ఆమె కుమారుడు మందీప్ రాణాలను ‘ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్ (పరారైన ఆర్థిక నేరస్తులు)గా ప్రకటించింది. ఈ ప్రకటన ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్ చట్టం–2018 (ఎఫ్ఈఓఏ) నిబంధనల ప్రకారం జరిగిందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షిమ్లా సబ్-జోనల్ కార్యాలయం దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కేసు నేపథ్యం
సోలన్ జిల్లా ధర్మపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ కేసును ఈడీ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో, మనవ్ భారతి యూనివర్సిటీ (సోలన్) పేరుతో నకిలీ డిగ్రీలను ఏజెంట్లు, విద్యార్థుల నుంచి డబ్బు తీసుకుని విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ కార్యకలాపాలకు యూనివర్సిటీ ప్రమోటర్ రాజ్ కుమార్ రాణా ప్రధాన సూత్రధారి కాగా, అతనికి భార్య ఆశోని కన్వర్, కుమారుడు మందీప్ రాణా సహకరించినట్లు ఈడీ వెల్లడించింది.
రూ.387 కోట్ల అవినీతి
సుమారు 36,000 వేల నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ విక్రయాల ద్వారా రూ.387 కోట్ల మేర అవినీతి ఆదాయం సమకూరినట్లు ఈడీ అంచనా వేసింది. ఈ డబ్బుతో దేశంలోని పలు రాష్ట్రాల్లో చర, స్థిరాస్తులను తమ పేర్లపై, సంబంధిత సంస్థల పేర్లపై కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు ఈడీ రూ.200 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసులో గతంలోనే ఈడీ 14 మంది వ్యక్తులు, రెండు సంస్థలపై పీఎంఎల్‌ఏ–2002 కింద అభియోగ పత్రం దాఖలు చేసింది. 2023 జనవరి 4న కోర్టు దీనిపై విచారణ స్వీకరించి, ఆశోని కన్వర్, మందీప్ రాణాకు సమన్లు జారీ చేసింది. అయితే వారు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో 2023 నవంబర్ 4న ఓపెన్-ఎండెడ్ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
ఆస్ట్రేలియాకు పారిపోయిన నిందితులు
ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయిన తర్వాతే ఆశోని కన్వర్, మందీప్ రాణా ఇద్దరూ దేశం విడిచి వెళ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్నట్లు ఈడీ తెలిపింది. విచారణకు హాజరు కావాలని పలుమార్లు సమన్లు పంపినా వారు స్పందించలేదని, భారత్‌కు తిరిగి రావడానికి నిరాకరించారని పేర్కొంది. దీంతో ఈడీ, ఎఫ్ఈఓఏ–2018లోని సెక్షన్ 4 కింద పిటిషన్ దాఖలు చేయగా, 2026 జనవరి 3న కోర్టు అనుమతి ఇచ్చి వారిని ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్‌గా ప్రకటించింది.
