
ప్రైవేటు సంస్థల ధిక్కారం.. రేవంత్ సర్కార్కు షాక్!
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు విషయంలో ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు మునుపెన్నడూ లేని విధంగా కఠిన వైఖరిని అవలంబించాయి. తమ బకాయిలు చెల్లించాలంటూ ఏకంగా విద్యాసంస్థలను, ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీంతో ప్రైవేటు సంస్థల తీరుపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. అయితే ప్రభుత్వం కూడా తమ నిబంధనలను పాటించని సంస్థలకు డబ్బులు చెల్లించలేమని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా బకాయిలు చెల్లించేంత వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రైవేటు సంస్థలు భీష్మించుకు కూర్చున్నాయి. అసలు ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయి. ఇన్ని రోజుల నుంచి తెరపైకి రాని ఈ విషయాలు స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక రానున్న సమయంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.
విద్యారంగంలో వివాదం
ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సుమారు ఒకవేయి 800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే కళాశాలలను నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించాయి. దీనిలో భాగంగా సోమవారం కొన్ని కళాశాలలను బంద్ చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం హయాం నుంచే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని టోకెన్లు జారీ చేసినా వాటికి సంబంధించిన నగదు మాత్రం ఇంతవరకు చెల్లించలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.
దీనిపై ప్రభుత్వం భిన్నమైన వాదనను వినిపిస్తోంది. అనేక ప్రైవేటు కళాశాలలు సరైన సౌకర్యాలు, అధ్యాపక సిబ్బంది లేకుండానే కేవలం రికార్డుల్లో మాత్రమే చూపించి ప్రభుత్వం నుంచి డబ్బులు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమర్పించిన నివేదికల్లో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. అనేక కళాశాలల్లో నకిలీ అధ్యాపకులను, తప్పుడు విద్యార్థుల సంఖ్యను చూపించి ఫీజు రీయింబర్స్ మెంట్ కింద నిధులు పొందుతున్నారని ప్రభుత్వం అనుమానిస్తుంది.
ఆరోగ్యశ్రీ వివాదం
ఇదే తరహాలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద తమకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తామని హెచ్చరించాయి. బకాయిలు చెల్లించే వరకు వైద్యసేవలు అందించలేమని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది.
ప్రైవేటు ఆసుపత్రుల వాదన
అధికారులతో అనేకసార్లు చర్చలు జరిపినా కేవలం హామీలు మాత్రమే లభించాయని, బకాయిల చెల్లింపు మాత్రం ఆలస్యం అవుతూనే ఉందని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలిగించినందుకు చింతిస్తున్నామని, కానీ తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి అనేక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు దొంగ బిల్లులు సృష్టిస్తున్నాయని, అవసరం లేకపోయినా రోగులకు ఆపరేషన్లు చేయడం, ఇన్ పేషెంట్గా ఉంచుకోవడం వంటివి చేస్తూ ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మంత్రుల చర్చలు
ప్రైవేటు సంస్థల ధిక్కార వైఖరిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, విద్యా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రైవేటు కళాశాలలు, ఆసుపత్రుల యాజమాన్యాలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత ప్రభుత్వం బకాయిల చెల్లింపునకు అంగీకరించింది. ముఖ్యంగా, రెండు ప్రధాన అంశాలపై ఒప్పందం కుదిరింది.ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు వారంలోగా బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో యాజమాన్యాలు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించుకొని మంగళవారం నుంచి కళాశాలలను తిరిగి తెరిచాయి. అయితే విద్యార్థుల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తారా, లేక కళాశాలలకే చెల్లిస్తారా అన్న విషయంలో స్పష్టత రాలేదు. సాధారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ నగదును నేరుగా విద్యార్థులకు కాకుండా కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లోనే జమ చేస్తారు.
ఆరోగ్యశ్రీ బకాయిలు
ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలోనూ ఇదే తరహా హామీ ఇచ్చింది. వారం రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని అప్పటి వరకు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయవద్దని ప్రభుత్వం కోరింది. దీనికి కూడా ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అంగీకరించింది. మొత్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు, ఆసుపత్రులు ప్రభుత్వంపై చేసిన "బ్లాక్మెయిల్" కు తాత్కాలికంగా తెరపడింది. కానీ వారం రోజుల్లో ప్రభుత్వం హామీ ప్రకారం నిధులు విడుదల చేయకపోతే ఈ వివాదం మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. ఈ అంశంలో ప్రభుత్వం నిబంధనలకు కట్టుబడి ఉన్న సంస్థలకు మాత్రమే బకాయిలు చెల్లిస్తుందా, మొత్తం చెల్లింపులు చేస్తుందా అన్నది వేచి చూడాలి. దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ప్రైవేటు సంస్థల వైఖరిని ప్రభావితం చేయనుంది.
