
ప్రేమ పేరుతో భారీ స్కామ్!
దేశంలో ఇటీవల కాలంలో ‘లవ్ జిహాద్’ పేరుతో వెలువడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యువతులను మాయమాటలతో మభ్యపెట్టి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి మతమార్పిడి, బలవంతపు వివాహాలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి గుజరాత్‌లో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ పోలీసులు సమయానికి చర్యలు తీసుకోవడంతో ఒక యువతి సురక్షితంగా తన ఇంటికి చేరింది.
పోలీసుల సమాచారం ప్రకారం ఇటీవల ఓ యువతి అదృశ్యమవ్వడంతో ఆమె తండ్రి గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులకు విచారణలో భాగంగా అనుమానాస్పద కోణం బయటపడింది.అదేంటంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ముస్లిం యువకులు, యువతులను ప్రేమ పేరుతో మభ్యపెట్టి, వివాహం ద్వారా మతం మార్పిడి చేసే ప్రయత్నం పోలీసులను ఆలోచనలో పడేసింది..
విచారణలో సోయిఫ్ అబ్దుల్ మానాఫుద్దీన్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తమైంది. అతను గాంధీనగర్‌లో ఒక హోటల్‌లో హౌస్‌కీపింగ్ సూపర్వైజర్‌గా పని చేస్తూ, బాధితురాలి ఇంటి వద్ద అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో బాధిత యువతితో పరిచయం పెంచుకొని, ఆమెను ప్రేమ పేరుతో మభ్యపెట్టి ఆ యువతి అతడిని పూర్తిగా నమ్మిన తరువాత పెళ్లి చేసుకుందామని నమ్మించి విమానంలో అస్సాంలోని హోజాయ్ జిల్లాకు తీసుకెళ్లాడు.అక్కడికి చేరిన తర్వాత తన మొబైల్ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచి కేవలం వైఫై కాల్స్ మాత్రమే వాడటంతో అతని కదలికలను గుర్తించడం క్లిష్టమైందని అధికారులు తెలిపారు
అయినా గాంధీనగర్ పోలీసులు సాంకేతిక సహాయంతో అతని లొకేషన్‌ను గుర్తించి గురువారం రాత్రి అధికారిక బృందాలతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బాధిత యువతిని రక్షించారు. శుక్రవారం ఉదయం ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.
గాంధీనగర్ ఎస్పీ రవి తేజ వసంశెట్టి మాట్లాడుతూ యువతి అస్సాం వెళ్లిన తరువాతే తన పొరపాటు తెలుసుకొని కుటుంబాన్ని సంప్రదించిందని, మరోవైపు విచారణలో ఆమె మైనర్ కాదని తేలడంతో నిందితుడిని చట్టపరంగా అరెస్ట్ చేయలేకపోయారని పేర్కొన్నారు. నిందితుడు సోయిఫ్ అబ్దుల్ మానాఫుద్దీన్‌పై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఆరు ఫిర్యాదులు ఉన్నాయని అంతేకాక అతని ఖాతాల్లో పెద్ద మొత్తం అనుమానాస్పద లావాదేవీలు సైతం గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సోయిఫ్ సహకరించిన ఇతర వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సంఘటనపై హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంగ్హవి స్పందిస్తూ గుజరాత్‌లో లవ్ జిహాద్‌కు స్థానం లేదు. ఇలాంటి ఘటనల్లో పాలుపంచుకునే వారిపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు అదేవిదంగా గాంధీనగర్ పోలీసుల సమయస్ఫూర్తితో బాధిత యువతిని రక్షించినందుకు పోలీసు అధికారులను అభినందించారు.
