
ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్య బీమా
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మిశ్రమ(హైబ్రిడ్) విధానంలో అందరికీ ఆరోగ్య బీమా పథకం అమల్లో ప్రభుత్వాసుపత్రుల పాత్రను పెంచారు. ఈ దిశగా 155 రకాల వైద్యసేవలను ప్రభుత్వాసుపత్రులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో...ప్రభుత్వాసుపత్రులకు ప్రస్తుతం రిజర్వ్ చేసిన 169 రకాల సేవలతో నూతన విధానంలో మొత్తం 324 రకాల వైద్యసేవలను ప్రభుత్వాసుపత్రుల ద్వారా ప్రజలకు లభిస్తాయి. ప్రస్తుతం డా.యన్.టి.ఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అందించబడుతూ అత్యంత అరుదుగా లబ్ధిదారులు వాడుకుంటున్న 197 రకాల వైద్యసేవలకు ట్రస్టు ద్వారా ఉచితంగా సేవలందించబడతాయి.
గత ప్రభుత్వం పెంచి చూపిన వైద్యసేవలు
ప్రస్తుతం డా.యన్.టి.ఆర్ వైద్యసేవ కింద లబ్ధిదారులకు ఉచితంగా అందించబడుతున్న వైద్యసేవలు, కొత్త మిశ్రమ(హైబ్రిడ్) విధానం కింద వాటిని క్రమబద్ధీకరించిన వైనాన్ని వైద్యారోగ్య శాఖామంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ సమీక్షించారు. ఆరోగ్య శ్రీ కింద ప్రజలకు అందించబడే వైద్యసేవలను పెంచిచూపటానికి, చికిత్సలో సారూప్యతతో పాటు ఒకేరకం ప్యాకేజీ విలువ కలిగిన పలురకాల వైద్యసేవలను విడివిడిగా చూపటంతో మొత్తం సేవల సంఖ్య 3,257 కు పెరిగినట్లు అధికారులు వివరించారు. అటువంటి సారూప్యత కలిగిన సేవలను వివిధ విస్తృత కేటగిరీలుగా వర్గీకరించటంతో సేవల సంఖ్య 186 మేరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రులకు కేటాయించిన 324 సేవలు, అరుదుగా వాడుకోబడుతున్న 197 సేవలు మినహాయించగా మిగిలిన 2,736 సేవలను 2,550 సేవలుగా క్రమబద్ధీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ 2,550 సేవలకు నూతన పథకం అమలుకు ఎంపిక కానున్న ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఈ రీతిన ప్రస్తుతం ప్రజలకు అందించబడుతున్న 3,257 వైద్య సేవలను నూతన బీమా పథకంలో లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
సేవల సంఖ్యను పెంచిన వైనం
ఆరోగ్య శ్రీ పథకంలో అందించబడిన వైద్యసేవల సంఖ్యను ఎక్కువగా చేసి చూపటానికి గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని వైద్యులు మంత్రికి వివరించారు. ఇందుకోసం అనుసరించిన విధానాలు
1.డెంగీ,టైఫాయిడ్ మరియు పారా టైఫాయిడ్ జ్వరాల చికిత్స విధానం మరియు ప్యాకేజీ విలువలు ఒకటే అయినా గత ప్రభుత్వం వాటిని విడివిడిగా చూపించింది. దీనికి బదులుగా వాటిని ' 'జ్వరాలు ' అన్న కేటగిరీలో చేర్చడం జరిగింది.
2.అదే రీతిన గుండెకు సంబంధించిన రైట్ హార్ట్ కేథటరైజేషన్, లెఫ్ట్ హార్ట్ కేథటరైజేషను (స్టెంట్ వేయడం) ఒకే కేటగిరీ కింద నూతన బీమా పథకంలో చేపడతారు.
3.వివిధ రకాలుగా చూపబడుతున్న అల్సర్ చికిత్సలను ఏకీకృతం చేసి అల్సర్ చికిత్సలు అన్న కేటగిరీలో చేర్చారు. ఈ విధంగా సారూప్యత కలిగిన 319 రకాల వైద్యసేవలను 133 రకాలుగా వర్గీకరించారు. ఉన్నత వైద్యుల బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూతన వర్గీకరణను సూచించింది.
ప్రభుత్వాసుపత్రులకు కేటాయించిన సేవలు
వివిధ ప్రభుత్వాసుపత్రులల్లో ఏర్పాటు చేయబడిన మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న వైద్యసిబ్బందిని దృష్టిలో పెట్టుకుని, వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకునే దిశగా 155 రకాల వైద్యసేవలను అదనంగా నూతన పథకం క్రింద ప్రభుత్వాసుపత్రులకు కేటాయించడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో జరిగే గర్భాశయ తొలగింపు, ఎపెండిక్స్ తొలగింపు, ఇ.యన్.టి సేవలను ఈ కేటగిరీలో చేర్చారు. అత్యంత అరుదుగా అవలంబించే థైమస్ గ్లాండ్ తొలగింపు, చిన్నప్రేగు మొదటి భాగం (డియోడినమ్) తొలగింపు వంటి 197 రకాల వైద్యసేవలకు డా.యన్.టి.ఆర్ ట్రస్టు ద్వారా చెల్లింపులు జరుగుతాయి. నూతన పథకం అమలుకు ఎంపికయ్యే ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం ఖర్చు బీమా పథకం కింద అందించబడే వైద్యసేవల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. సేవల సంఖ్య ఎక్కువ ఉంటే..ఆ మేరకు ప్రీఆథరైజేషన్ మరియు పాలనా వ్యయం వంటి అంశాల ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియం పెరుగుతుంది. గత ప్రభుత్వ వైద్యసేవల వర్గీకరణ ప్రకారం ఈ ఖర్చు పెరిగే అవకాశం ఉన్నందున దానిని నియంత్రించే దృష్టితో సహేతుక రీతిలో వైద్యసేవల నూతన వర్గీకరణ చేయటం జరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
నూతన ఆరోగ్య బీమా పథకం
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మిశ్రమ(హైబ్రిడ్) విధానంలో అందరికీ ఆరోగ్య బీమా పథకం కింద రాష్ట్రంలో 1.63 కోట్ల లబ్ధిదారుల కుటుంబాలకు సంవత్సరానికి రూ.2.5లక్షల మేరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా కల్పిస్తారు. ఇందులో మొదటిసారిగా పేదరిక రేఖకు పైనవున్న 20 లక్షల ఏ.పి.యల్ కుటుంబాలకు కూడా ఆరోగ్య బీమా లభిస్తుంది. ఉద్యోగస్తులకు, పాత్రికేయులకు ప్రత్యేక ఆరోగ్యసేవల పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం డా.యన్.టి.ఆర్ వైద్యసేవ కింద ఉచితంగా వైద్యం పొందుతున్న 1.43 కోట్ల కుటుంబాలకు రూ.2.5 లక్షలు దాటి రూ.25 లక్షల వరకు అయ్యే ఖర్చును డా.య్.టి.ఆర్.వైద్య ట్రస్టు ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది.
