
ప్రపంచ శాంతి దినోత్సవం - ప్రపంచ శాంతి పరిస్థితి
మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచం అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది నిజంగా ఎంతమందికి తెలుసు.. 1982 లో సెప్టెంబర్ 21 న ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది.. ఇది కేవలం పత్రికా ప్రకటనల కోసం గడిపే రోజు కాదు. యుద్ధాలతో నిండిన మానవ చరిత్రలో, సంభాషణ, సయోధ్య, పరస్పర గౌరవం ద్వారానే నిజమైన విజయాలు సాధ్యమని గుర్తు చేసే స్ఫూర్తిదాయకమైన రోజు.
మానవ చరిత్రలో యుద్ధాలు ఎన్నో ప్రాణాలను బలిగొన్నాయి. అయినా శాంతి మార్గాన్ని ఎంచుకున్న గొప్ప ఉదాహరణలు మనకున్నాయి. రెండు వేల ఏళ్ల క్రితం కళింగ యుద్ధం లో రక్తపాతం చూసి చక్రవర్తి అశోకుడు జయాల మార్గాన్ని విడిచి ధర్మం వైపు తన మార్గాన్ని కొనసాగించాడు. హింసను త్యజించి సత్యం, న్యాయం, పరస్పర సహజీవనాన్ని ప్రోత్సహిస్తూ ఆయన చెక్కించిన శాసనాలు ఈ రోజుకి కూడా మనకు మార్గదర్శకాలు. శతాబ్దాల తరువాత మహాత్మా గాంధీ అదే సూత్రాన్ని ఆధునిక రాజకీయ పోరాటంగా మలిచారు. సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో ఆయన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపి ప్రపంచవ్యాప్తంగా పౌరహక్కుల ఉద్యమాలకు ప్రేరణనిచ్చారు. అశోకుడు, గాంధీ చూపించిన దారి శాంతి అనేది బలహీనత కాదు, నిజమైన ధైర్యమని స్పష్టంగా చెబుతుంది.
ఇప్పటి ప్రపంచం ఆ ధైర్యాన్ని అత్యవసరంగా కోరుకుంటోంది. పశ్చిమ ఆసియా నుండి తూర్పు యూరప్ వరకు, దక్షిణ చైనా సముద్రం నుండి ఆఫ్రికా వరకు యుద్ధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా -ఉక్రెయిన్‌ల యుద్ధం, సూడాన్‌లో ఘర్షణలు, గాజా–ఇజ్రాయెల్ మధ్య హింస, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శక్తి పోటీ ఇవి అన్నీ ప్రపంచ శాంతి కల ఎంత సున్నితమో సూచిస్తున్నాయి. యుద్ధం లేకపోయినా, మత విద్వేషం, విద్వేష పూరిత ప్రసంగాలు, సైబర్ దాడులు వంటి కొత్త ముప్పులు సమాజాల మధ్య విభేదాలను పెంచుతున్నాయి. అంతర్జాతీయ దౌత్య సంబంధాలు వసుదైక కుటుంబకం అనే నానుడిని మరిచి ముందుకు వెళ్తున్నాయి.
భారతదేశం కూడా ఈ విరుద్ధ సత్యాన్ని అనుభవిస్తోంది. వలస పాలన, విభజన వంటి కఠిన సందర్భాల తరువాత పుట్టిన మన రాజ్యాంగం శాంతి, సమానత్వం, న్యాయాన్ని ప్రాథమిక విలువలుగా పేర్కొంది. అసంలీన విధానాన్ని అనుసరిస్తూ, గ్లోబల్ సౌత్‌కు వాణిగా, ఐక్యరాజ్యసమితి శాంతి దళాలకు సైనికులను అందిస్తూ భారత్ అంతర్జాతీయ వేదికలపై శాంతి పతాకాన్ని ఎగురవేసింది. అయినప్పటికీ సరిహద్దు ఉద్రిక్తతలు, మతపరమైన విభజనలు, తీవ్రవాదం వంటి సవాళ్లు మన ముందున్నాయి. కోట్లాది ప్రజలతో కూడిన ఈ వైవిధ్యభరిత ప్రజాస్వామ్యంలో గాంధేయాత్మక అహింసను కాపాడటం నిరంతర కృషిని గుర్తుచేస్తున్నాయి.
అంతర్జాతీయ వేదికలు ఐక్యరాజ్యసమితి, ఆసియాన్, వాతావరణ ఒప్పందాలు, నిరాయుధీకరణ ప్రయత్నాలు చర్చలకు అవకాశం కల్పిస్తున్నాయి. కానీ ఈ సంస్థలు దేశాల రాజకీయ సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. శాంతి అనేది బయట నుంచి వచ్చేది కాదు; అది ప్రతి మనసులో పుట్టాలి. తరగతుల్లో పిల్లలు పరస్పర గౌరవం నేర్చుకునే చోట, చట్టసభల్లో సంభాషణతో విభేదాలు పరిష్కరించే చోట, పక్కింటి సమాజాల్లో ద్వేషాన్ని తిరస్కరించే చోట శాంతి నిజంగా బలపడుతుంది.కొన్ని దేశాలు రక్త దాహంతో హింసా కార్యక్రమాలు రాజుకునేలా ప్రత్యర్థిని జయించాలి అనుకుంటున్నాయి.దీనిద్వారా ఆదేశ ప్రజలు వనరులు దెబ్బతింటున్నాయని ఆలోచించకపోవడం శోచనీయం. ఐరాస పెద్దరికాన్ని ఈ చర్యలు ప్రశ్నిస్తున్నాయి.వీటికి శాంతి చర్చలే ముగింపు పలకాలి.
ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా భారతీయులు వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలి. అశోకుడి పశ్చాత్తాపం, గాంధీ సత్యాగ్రహం చూపినట్లుగా, శాంతి అనేది బలహీనత కాదు; అది బలమైన అత్యున్నత శక్తి. సాంకేతిక విప్లవాలు, భౌగోళిక రాజకీయ మార్పులు వేగంగా జరిగే ఈ కాలంలో, అహింసా వాదాన్ని ఎంచుకున్న భారత వాణి ప్రపంచానికి టార్చ్ బేరర్ (దారిదీపంగా )నిలవగలదు.
సవాలు పెద్దది, కానీ మార్గం స్పష్టంగా ఉంది. భయం, జాత్యహంకారం, దాడి మన భవిష్యత్తును నిర్దేశించనివ్వాలా? లేక మన చరిత్ర ఇచ్చిన జ్ఞానాన్ని పిలిచి మరింత మానవీయ రేపటిని సృష్టించాలా? సెప్టెంబర్ 21 కేవలం క్యాలెండర్‌లోని తేదీగానే కాకుండా, చర్యకు పిలుపుగా, శాంతి సాధ్యమే కాదు అది న్యాయమైన ప్రపంచానికి అత్యంత ఆచరణీయ మార్గమని గుర్తు చేసే దినంగా మారాలి
