
ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే .. న్యాయస్థానాలు కాదు
జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ న్యాయస్థానం కాదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతి పక్ష హోదా వస్తుందో అని కూడా తెలియకుండానే జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారని ఎద్దేవా చేశారు. గతంలో తాము 23 మంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్లు తమ నుంచి నలుగురు సభ్యులను లాగేసుకున్నా ధైర్యంగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన పోరాటం చేశామని గొట్టిపాటి గుర్తు చేశారు. అవినీతి, అక్రమాలకు సంబంధించి జగన్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చి నేటికి 12 ఏళ్లు పూర్తయిందని ఇందుకోసమే పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారేమోనని మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి సమాధానం చెప్పారు.
జగన్ విధ్వంసంతో అమరావతి అభివృద్ధి పనులు ఐదేళ్లు ఆలస్యమయ్యాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మంత్రి గొట్టిపాటి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు భవనంలోని వివిధ ఛాంబర్లను మంత్రికి చూపించారు. విద్యుత్ పనుల వివరాలను మంత్రికి తెలియజేశారు. దసరా కు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి కావాలని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భవనానికి విద్యుత్ అంతరాయాలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయాలన్నారు. సీఆర్డీఏతో విద్యుత్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అమరావతి ఆంధ్రుల ప్యూచర్ సిటీగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో సీఆర్డీఏ పరిధిలో విద్యుత్ ప్రమాదాలకు తావు లేకుండా అధునాతన భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
నాణ్యతలో రాజీ లేదు
సీఆర్డీఏ ప్రధాన భవనం పరిశీలన తరువాత మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు. గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పనులకు ఆటంకం ఎదురైనా నాణ్యత విషయంలో రాజీ పడకుండా., భవన ప్రారంభ సమయానికి అన్ని పనులూ పూర్తయ్యేలా చూస్తున్నామని తెలిపారు. 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో సుమారు రెండు మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు ఇస్తే., ఐదేళ్ల పాటు జగన్ విధ్వసం సృష్టించి రాజధాని లేని రాష్ట్రంగా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బాధ్యతాయుతంగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ల తయారీ కూడా చేపడుతున్నామని వివరించారు. ఏటేటా పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
