Let's talk: editor@tmv.in
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

Panthagani Anusha
22 సెప్టెంబర్, 2025

సాహసాలంటే యువత ప్రాణం పెడుతుంటారు, కొత్త ప్రదేశాలను చూడాలని, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో తమ ధైర్యాన్ని చాటుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అయితే ఈ ఆరాటమే కొన్నిసార్లు వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. అలా ఓ యువకుడు చేసిన సాహసం అతడి ప్రాణాలనే బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

అటవీశాఖ నిషేధిత ప్రాంతమైన కొంగాల జలపాతం వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఓ యువకుడు నీటిలో పడి మృతి చెందాడు. అటవీశాఖ అధికారుల హెచ్చరికలను, నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా ప్రమాదకరమైన జలపాతాన్ని సందర్శించడమే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు ములుగు జిల్లాలోని కొంగాల జలపాతం సందర్శనకు వచ్చారు. అటవీశాఖ నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ వారు అటవీ సిబ్బంది కళ్లుగప్పి స్థానికుల సహాయంతో జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతం వద్ద స్నేహితులందరూ కలిసి సరదాగా గడుపుతున్న సమయంలో మహాస్విన్ అనే యువకుడు పక్కనే ఉన్న నీటిలోకి దిగి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడటానికి ప్రయత్నించిన ఓ మహిళతో పాటు మరో ఇద్దరు స్నేహితులు ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్కడే ఉన్న అర్జున్ అనే యువకుడు వెంటనే స్పందించి, తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. కానీ మహాస్విన్ మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

యువకుడు గల్లంతైన విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో వారు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సుమారు ఐదు గంటల పాటు శ్రమించి గజ ఈతగాళ్ల సహాయంతో మహాస్విన్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు అటవీశాఖ అధికారులు పోలీసులు నిషేధాజ్ఞలు ఉన్న ప్రదేశాలకు సందర్శకులు వెళ్లవద్దని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడ స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషాద సంఘటనతో యువతలో సాహసాల పట్ల ఉన్న అత్యుత్సాహం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టమైంది.

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా - Tholi Paluku