
ప్రాణం తీసిన ఆలస్యం
మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉండి, అత్యవసర వైద్యం అందాలి అన్నప్పుడు అందరికీ గుర్తొచ్చేది అంబులెన్స్,అంతేకాక హాస్పిటల్ కి వెళ్ళేలోపు రోగికి కావలసిన ప్రథమ చికిత్స అందించడంలో ఎల్లప్పుడు ముందుంటుంది. అటువంటి అంబులన్స్ ఆలస్యంగా వస్తే ఎంతటి విషాదం జరుగుతుందో అల్లూరి జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాదం ఉదాహరణగా నిలిచింది.
పెదవలస పంచాయితీ గొంతు వలస గ్రామం జికే విధి ఏజెన్సీ చెందిన ఐదో తరగతి విద్యార్థిని మర్రి కవి రాత్రి భోజనం ముగించుకొని ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైంది. అప్రమత్తమైన తల్లిదండ్రులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఆ సమయంలో 108 అంబులెన్స్ అప్పటికే మరో రోగిని తరలిస్తున్నందున గ్రామానికి చేరుకోలేకపోయింది. దాంతో ప్రత్యామ్నాయంగా పంపిన ఫీడర్ అంబులెన్స్లో చిన్నారిని ఎక్కించారు. కానీ కొంత దూరం వెళ్ళగానే ఆ వాహనం సరిగా పనిచేయక మార్గం మధ్యలోనే ఆగిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. చివరకు తల్లిదండ్రులు హుటాహుటిన ద్విచక్రవాహనంపై చిన్నారిని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. హాస్పిటల్ కి చేరేలోపే చిన్నారి తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్పిటల్ ముందే బోరున విలపించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్స్లు తక్కువగా ఉండటం, సకాలంలో చేరుకోకపోవడం, మధ్యలో వాహనాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ లోపాలు ప్రాణాలను బలి తీసుకుంటున్నా పరిష్కార చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుండటమే ఆందోళన కలిగిస్తోంది,ఇదిలా ఉండగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, సకాలంలో అంబులెన్స్ సాయం లభించి ఉంటే ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడేదని ఆరోపించారు. అంతేకాక ఏజెన్సీ ప్రాంతంలో తరచుగా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, కనీసం ఇప్పుడు అయినా ప్రభుత్వం అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు.ఈ ఘటన ఒక్క క్షణం ఆలస్యం సైతం ప్రాణాంతకమవుతుందని మరోసారి నిరూపించింది.
