Let's talk: editor@tmv.in
ప్రజల పోరాటం, పటేల్ కృషితోనే విమోచనం

ప్రజల పోరాటం, పటేల్ కృషితోనే విమోచనం

Gaddamidi Naveen
19 సెప్టెంబర్, 2025

ప్రజల పోరాటం, ఆనాటి కేంద్రహోమంత్రి సర్దార్ వల్లభబాయ్ పటేల్ కృషితోనే హైదరాబాద్ రాజ్యానికి విముక్తి లభించిందని ప్రజ్ఞా భారతి చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత త్రిపురనేని హనుమాన్ చౌదరి వ్యాఖ్యానించారు. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని భద్రుకా కాలేజీలో 'నిజాం పాలన చివరి రోజులు' పుస్తకావిష్కరణ సభ జరిగింది. నిజాం పాలన చివరి రోజులు, హైదరాబాద్ విలీనానికి సంబంధించి ఆంగ్లంలో కేఎం మున్షీ రచించిన పుస్తకాన్ని కస్తూరి మురళీకృష్ణ తెలుగులో 'నిజాం పాలన చివరి రోజులు' పేరిట రచించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ చౌదరి మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు దేశాన్ని ముక్కలుగా చేసేందుకు గాంధీ ఒప్పుకోవడంతో దేశం రెండు భాగాలు అయ్యిందన్నారు. అప్పట్లోనే హైదరాబాద్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలని కూడా ప్రయత్నించారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో స్వతంత్ర సంస్థాలన్నీ భారత్లో కలిశాయని చెప్పారు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో హైదరాబాద్ ప్రాంతం ఉండేదని ఆ సమయంలో హిందూ మహిళలపై హింసలు, లైంగికదాడులు జరిగాయని గుర్తు చేశారు.

హైదరాబాద్లో జాతీయ జెండా ఎగరలేదు

‘స్వాతంత్య్రం తర్వాత హైదరాబాద్లో జాతీయ పతాకం ఎగరలేదు. నిజాం పాలన కొనసాగింది. ప్రజల వీరోచిత పోరాటం వల్ల విమోచనం సాధించాం’ అని తెలిపారు. ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో వీవీ లక్ష్మీనారాయణ సహాయపడ్డారని గుర్తు చేశారు. మురళీకృష్ణ రచించిన 'వ్యక్తిత్వం', 'తీవ్రవాదం' పుస్తకాల ప్రాముఖ్యత వివరించారు. హైదరాబాద్ ప్రజలు బానిసత్వంతో బాధ పడ్డారని, నిజాంకు అండగా ఖాసిం రజ్వీ, రజాకార్ల వ్యవస్థను ఏర్పాటు చేసి అరాచకాలు చేశారని వివరించారు. నిజాం హిందువులను చంపడానికి రజ్వీని ప్రోత్సహించాడని చెప్పారు.

1947 జూన్లో కమ్యూనిస్టులు కరీంనగర్, ఖమ్మం, నల్గొండలో కార్యాలయాలు స్థాపించారని, 560కి పైగా సంస్థానాలు భారతదేశంలో విలీనమైనా హైదరాబాద్ మాత్రం విలీనం కాలేదన్నారు. క్యాబినెట్లో నెహ్రూ, హైదరాబాద్లో జరుగుతున్న హింసలు, అత్యాచారాలు గురించి తెలిపారన్నారు. "1947 నవంబర్ నుంచి హైదరాబాద్ పరిస్థితులు తెలుసుకోమని సర్దార్ పటేల్కు చెప్పారు. పటేల్ 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఆపరేషన్ పోలో నిర్వహించారు అని గుర్తు చేశారు. జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో సైనిక చర్యలు జరిగాయని, దక్కన్ రేడియో ద్వారా వివరాలు ప్రకటించారని వివరించారు. రజాకార్లు ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. "కేవలం సైనిక చర్యల వల్లే హైదరాబాద్ విలీనమైంది" అని చెప్పారు.

అనంతరం రాకా సుధాకర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోవడంతో హైదరాబాద్ భారత్లో విలీనమైందని తెలిపారు. "నిజాం కాలంలో హిందూ వ్యాయామశాలలు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉండేదని.. కానీ ముస్లింల పండగైన మొహరానికి మాత్రం అనుమతులుండేవని చెప్పారు. కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తామని చెప్పినా, వారు ఇండియన్ యూనియన్పై పోరాడారని వివరించారు. మురళీకృష్ణను అభినందించి, ఇలాంటి మరిన్ని పుస్తకాలు రాయాలని కోరారు.

చరిత్ర తెలుసుకోవాలి

వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ "చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి? ఎప్పుడైనా పునరావృతమవుతుంది కాబట్టి తెలుసుకోవాలి" అని చెప్పారు. చరిత్రను అనుకూలంగా మార్చకూడదని, రాజకీయ నాయకులు చరిత్ర మార్చి హీరోలుగా మారుతున్నారని విమర్శించారు. "నిజాం కట్టడాలు చూసి గొప్పవాడనుకుంటారు, కానీ హిందూ మహిళలపై హింసలు, అరాచకాలు, హిందువులను చంపడం చేసిన వాడు ఎలా గొప్పవాడు?" అని ప్రశ్నించారు. చరిత్ర చదవడం వల్ల అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఇటీవల కొందరు 'గో బ్యాక్ మార్వాడీ' అనడం వారి స్వార్థం కోసమేనని, సమాజం కోసం కాదని అన్నారు. ఈ పుస్తకాన్ని చదివి నిజాం చరిత్ర తెలుసుకోవాలని, యువతకు ఇలాంటి విషయాలు తెలియజేయాలని సూచించారు. శుత్రదేశంతో పోరాడేందుకే ఆర్మీ ఉంటుందని .. కాబట్టి ఆపరేషన్ పోలో లో సైనికులు పాల్గొన్నా దాన్ని పోలీసు చర్యగానే అభివర్ణించాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాచం రమేష్, వీ శ్రీనివాస్, రఘు, కళాకారుల బృందం, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల పోరాటం, పటేల్ కృషితోనే విమోచనం - Tholi Paluku