Let's talk: editor@tmv.in
ప్రజాభిప్రాయం లేకుండానే బీచ్ శాండ్ లీజులా?

ప్రజాభిప్రాయం లేకుండానే బీచ్ శాండ్ లీజులా?

FL - YUGDR
15 సెప్టెంబర్, 2025

ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే కేంద్ర పెద్దల ఒత్తిళ్లతో ఏపీ ప్రభుత్వం తీర ప్రాంతాల్లో వేలాది ఎకరాలను అదానీకి లీజులికిచ్చేయడాన్ని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ తప్పుపట్టారు. బీచ్ శాండ్ లీజుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే మత్స్యకారులు తిరగపడక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈఏఎస్ శర్మ పూర్తి వివరాలతో ఒక లేఖ రాశారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంతో పాటు విశాఖ జిల్లా భీమిలి వద్ద వందల ఎకరాల తీర ప్రాంతంలో అదానీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం మూడు బీచ్ శాండ్ మైనింగ్ లీజుల్ని ముట్టజెప్పడం, క్షణాల్లో ఆ కంపెనీ ఎలాంటి అంతరాయం లేకుండా పని మొదలు పెట్టడం జరిగిపోయాయని పేర్కొన్నారు.

అభిప్రాయ సేకరణ చేయరా?

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చట్టపరంగా మత్స్యకారులకు ఉన్న ముందస్తు ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనను సడలించడమేమింటని శర్మ పేర్కొన్నారు. ప్రైవేట్ బీచ్ శాండ్ మైనింగ్ కారణంగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని మద్రాస్ హైకోర్టు కేసులో బయటపడిన విషయాలు మీకు తెలియనివి కావని సూచించారు. గతంలోనూ కోస్తా ప్రాంతంలో మత్య్స సంపదపై ఆధారపడుతూ తీర ప్రాంతంలో వనరుల్ని పరిరక్షిస్తున్న 15 లక్షల మంది సంప్రదాయ మత్స్యకారులు ఎదుర్కొంటున్న గడ్డు సమస్యలపై ప్రభుత్వం, వారి అభివృద్ధిపై దృష్టి పెట్టి, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయడం ఎంత అవసరమో అన్న విషయాన్ని గతంలో మీరే ప్రస్తావించారంటూ గుర్తు చేశారు.

ప్రధాని మోడీ కూడా హామీ ఇచ్చారు

ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం సంప్రదాయ మత్స్యకారుల సంక్షేమానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోదని సాక్ష్యాత్తూ ప్రధాని మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని శర్మ గుర్తు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ఇచ్చిన ప్రసంగంలో మోడీ పేర్కొన్న అంశాల్ని తెలియజేశారు. మత్స్యకారుల హక్కుల పరిరక్షణకు ప్రధాని ఇచ్చిన హామీల్ని ఎంత వరకు చిత్తశుద్ధితో అమలు చేస్తారనే విషయమై ప్రజల్లో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.

ప్రైవేట్ సంస్థల లాభాల కోసమే కూటమి ప్రభుత్వం

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో చేయి కలిపిన టీడీపీ-జనసేన ప్రభుత్వం, కేవలం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లాభాల్ని కలిగించే దిశలో తీర ప్రాంతంలో నివసిస్తున్న సంప్రదాయ మత్స్యకారులకు ఉన్న హక్కుల్ని విస్మరిస్తూ దేశ భద్రతకు విరుద్ధంగా 'బీచ్ శాండ్' లో ఉన్న అణుధార్మిక ఖనిజాల్ని వెలికి తీసి అమ్ముకునే హక్కును అదానికి రాసిచ్చేశారని శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో 2275 ఎకరాల్లో రెండు లీజులు, విశాఖ జిల్లా భీమిలి వద్ద 225 ఎకరాల్లో ఒక లీజును అదానీ కంపెనీకి సమర్పించిన విషయాన్ని శర్మ గుర్తు చేశారు. అటువంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టే ముందు ఆ ప్రాంత మత్య్సకారులతో ముందస్తు సంప్రదింపులు చేయాలనే చట్ట నిబంధనను మీ భాగస్వామ్యులైన ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సడలించడం, మీ ఆధ్వర్యంలోనే జరిగినట్టు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. మత్స్యకారులు ఆశ్చర్యపడడమే కాకుండా ఎంతో నిరాశ పడుతున్నారని మీ దృష్టికి తీసుకు వస్తున్నానని శర్మ పవన్ కల్యాణ్ కు స్పష్టం చేశారు. పారిశ్రామిక కార్యకలాపాల్ని ప్రారంభించే ముందు ఆ పరిశ్రమల ప్రభావం ఎవరి మీద ఉండగలదో, వారిని ముందస్తుగా సంప్రదించడం, పర్యావరణ చట్టం కిందే వస్తుందని, బీచ్ శాండ్ విషయంలో ఆ నిబంధనను కేంద్రం నోటిఫై చేసిందన్నారు.

అమ్మో.. అణు ధార్మికత

అటువంటి చట్ట నిబంధనను సడలించేందుకు కేంద్రం సూచించిన కారణం ముందస్తుగా తీర ప్రాంత ప్రజల్ని అంటే మత్స్యకారుల్ని సంప్రదిస్తే దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని శర్మ పేర్కొన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి మత్స్యకారులపై నమ్మకం లేనట్టేనా అని ప్రశ్నించారు. పాకిస్తాన్తో యుద్ధం సమయంలో మత్స్యకారులు గతంలో భారత ప్రభుత్వానికి ఏవిధంగా సహకరించారో తెలియనిది కాదన్నారు. అదే సమయంలో బీచ్ శాండ్ మైనింగ్ కారణంగా అణు ధార్మికత వల్ల వాటిల్లే ముప్పును కూడా శర్మ పూర్తి గణాంకాల్ని సమర్పించారు. మత్స్య వనురులకు, మత్స్యకారుల జీవనోపాధికి నష్టం కలిగించే అదానీ కంపెనీ మైనింగ్ కార్యకలాపాలకు అంతరాయం లేకుండా లాభదాయంగా ముందుకు పోవడమే ఎన్డీఏ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. అంటే ఆదానీ పై ఏపీ ప్రభుత్వానికి ఉన్న వ్యామోహం అర్తం చేసుకోవచ్చన్నారు. బీచ్ శాండ్ వల్ల కలిగే ఉపయోగాలతో పాటు అంతేస్థాయిలో కలిగే నష్టాలూ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2019లో బీచ్ శాండ్ అన్వేషణకు ఇచ్చిన ప్రైవేట్ లీజుల్ని పూర్తిగా రద్దు చేశారన్న విషయం మీకు తెలియదా? మళ్లీ ఒత్తిళ్లకు లొంగి 2022 లో అనుమతించేశారని మండిపడ్డారు. చట్టాల్ని సవరించేసి అదానికి లొంగిపోయారని ప్రజలంటున్నారని, అదే విషయమై ఈ నెల 11 న రాష్ట్రపతికి లేఖ రాసినట్టు కూడా శర్మ తెలియజేశారు. అందుకే బీచ్ శాండ్ మైనింగ్ లీజుల విషయంలో స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ను కోరారు.

ప్రజాభిప్రాయం లేకుండానే బీచ్ శాండ్ లీజులా? - Tholi Paluku