Let's talk: editor@tmv.in
పామాయిల్ ఫ్యాక్టరీ మా కల : హరీష్ రావు

పామాయిల్ ఫ్యాక్టరీ మా కల : హరీష్ రావు

T Venkata Ramana
23 సెప్టెంబర్, 2025

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ ఫ్యాక్టరీని కేవలం ఒక పరిశ్రమగా కాకుండా వేలాది మంది రైతుల జీవితాలను మార్చే ఒక 'ఎమోషన్'గా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ దార్శనికత వల్లనే ఈ ప్రాంతం పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిందని ఈ ఫ్యాక్టరీ ఆ కృషికి దక్కిన ఫలితమని ఆయన స్పష్టం చేశారు.

రైతు జీవితాల్లో గుణాత్మక మార్పు

నర్మట్టలో ఫ్యాక్టరీని సందర్శించిన అనంతరం హరీష్ రావు ప్రసంగించారు. ఈ పామాయిల్ ప్లాంట్ సాకారం కావడం ఒక గొప్ప విజయంగా పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకువస్తుందని వారి దశ, దిశను మార్చే సామర్థ్యం దీనికి ఉందని అన్నారు. 2004లో తాను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతం కరువు ప్రాంతంగా ఉండేదని, బోర్ వేయడానికి కూడా తహసీల్దార్ అనుమతి కావాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ వంటి ఎత్తిపోతల పథకాలు, చెరువులు, చెక్ డ్యాముల వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఆరు మీటర్ల మేర పెరిగి, బోరు బండ్లు మాయమైపోయాయని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే

గతంలో అశ్వరావుపేట, సత్తుపల్లి వంటి సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే పామాయిల్ పండేదని, కానీ కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ఫలితంగా తెలంగాణ అంతటా, ముఖ్యంగా సిద్దిపేటలో కూడా పామాయిల్ సాగుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని తెలిపారు. 2018లో పరిశోధకులు సిద్దిపేటలో పామాయిల్ సాగు సాధ్యం కాదని చెప్పిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల గాలిలో తేమ శాతం పెరిగి 2021లో పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిందని పరిశోధకులు ప్రకటించారని వివరించారు. ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగుకు, రైతుల జీవితాల్లో వెలుగులు రావడానికి కారణం కాళేశ్వరమేనని ఆయన చెప్పారు. వరి సాగులో ఎకరానికి రూ. 30వేల కంటే ఎక్కువ ఆదాయం రాదని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని ఎరువులు కూడా దొరకడం కష్టమైందని హరీష్ రావు విమర్శించారు. అయితే పామాయిల్ సాగు చాలా లాభసాటిగా ఉంటుందని, ఒక్కసారి మొక్క నాటితే 30 ఏళ్ల వరకు ప్రతి నెల జీతం పడినట్టు ఆదాయం వస్తుందని తెలిపారు. ఐటీ ఉద్యోగం వదిలి పామాయిల్ సాగు చేస్తున్న చిన్నకోడూరు రైతు ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.

ప్రారంభించింది బీఆర్ఎస్సే

ఈ ఫ్యాక్టరీకి 2022 ఏప్రిల్ 5న అప్పటి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని, అయితే ఇప్పుడు "విత్తనం నాటింది బీఆర్‌ఎస్ అయితే, పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వారు బయలుదేరారు" అంటూ విమర్శించారు. ఈ ఫ్యాక్టరీ రావడానికి వెనుక ఉన్న కష్టం, శ్రమ, చెమట చిందించింది ఎవరనేది ప్రజలకు తెలుసని, ఇప్పుడు రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించడానికి కత్తేర్లు జేబులో పెట్టుకొని బయలుదేరారని ఎద్దేవా చేశారు.

భవిష్యత్తులో బీఆర్ఎస్‌దే అధికారం

ఈ ఫ్యాక్టరీలో మలేషియా నుండి అత్యాధునిక సాంకేతికతను తీసుకొచ్చారని దీనివల్ల భారతదేశంలో ఏ ఫ్యాక్టరీలోనైనా 100 టన్నుల గెలలకు 19 టన్నుల ఆయిల్ వస్తుండగా, ఈ ఫ్యాక్టరీలో 20 టన్నుల ఆయిల్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ అదనపు లాభం రైతులకు దక్కుతుందని హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే గోద్రెజ్, నవభారత్, పతంజలి వంటి సంస్థల ప్రతినిధులు ఈ సాంకేతికతను పరిశీలించడానికి వచ్చారని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ప్రతి జిల్లాలో ఒక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారని హరీష్ రావు తెలిపారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రణాళికలు అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఇతర బీఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

పామాయిల్ ఫ్యాక్టరీ మా కల : హరీష్ రావు - Tholi Paluku