Let's talk: editor@tmv.in
పని ఒత్తిడి భరించలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

పని ఒత్తిడి భరించలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Dantu Vijaya Lakshmi Prasanna
6 ఫిబ్రవరి, 2026

నగరంలోని ఐటీ కారిడార్‌లో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో పెరుగుతున్న పని ఒత్తిడిని, కోడింగ్ సవాళ్లను తట్టుకోలేక ఓ యువ ఇంజనీర్ తన ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం ప్రాంతానికి చెందిన సతీష్ (31), గచ్చిబౌలిలోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితమే వివాహమైన సతీష్, మియాపూర్‌లోని బీకే ఎన్‌క్లేవ్‌లో తన సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండుగ నిమిత్తం జనవరిలో అతని భార్య సొంతూరుకు వెళ్లా రు.

బుధవారం ఉదయం సతీష్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. ఎంతసేపటికీ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు, తలుపులు బద్దలు కొట్టి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఆత్మహత్యకు కారణాలు:

సతీష్ సుమారు రెండు నెలల క్రితమే ఈ కొత్త సంస్థలో చేరారు. ఇటీవల అతనికి కేటాయించిన కోడింగ్ పనులు చాలా క్లిష్టంగా అనిపించాయని, వాటిని పూర్తి చేయడంలో అతను తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. తాను పనికి న్యాయం చేయలేకపోతున్నాననే ఆందోళనతో సతీష్ గత కొద్దిరోజులుగా భార్యతో, సోదరుడితో తన బాధను పంచుకున్నట్లు సమాచారం.

పని గంటలు కారణం కాదు

ఈ కేసులో లాంగ్ వర్కింగ్ అవర్స్ (ఎక్కువ సమయం పని చేయడం) కారణం కాదని, కేవలం పని అవసరాలను అందుకోలేకపోతున్నాననే భావనే అతడిని ఈ నిర్ణయానికి పురికొల్పిందని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.మియాపూర్ పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల ఇలాంటి కేసులు నగరంలో అధికమవుతున్నాయని, మీకు ఏవైనా మానసిక సమస్యలు ఉన్నా లేదా ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నా వెంటనే నిపుణుల సహాయం తీసుకోండని పోలీసులు సూచిస్తున్నారు.

సంప్రదించవలసిన న౦బర్లు :

రోష్ని హెల్ప్‌లైన్:

040-66202000,

ఆసరా:

9820466726

పని ఒత్తిడి భరించలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య - Tholi Paluku