Let's talk: editor@tmv.in
పనామాలో చైనాకు భారీ ఎదురుదెబ్బ.. ఓడరేవుల కాంట్రాక్ట్ రద్దు

పనామాలో చైనాకు భారీ ఎదురుదెబ్బ.. ఓడరేవుల కాంట్రాక్ట్ రద్దు

Shaik Mohammad Shaffee
31 జనవరి, 2026

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన పనామా కాలువ వద్ద చైనా ప్రాబల్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాలువకు రెండు చివరల ఉన్న ‘బాల్బోవా’, ‘క్రిస్టోబల్’ ఓడరేవులను నిర్వహిస్తున్న హాంకాంగ్‌కు చెందిన ‘సీకే హచిసన్’ అనుబంధ సంస్థ ‘పనామా పోర్ట్స్ కంపెనీ’ ఒప్పందాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కంపెనీకి 2021లో ఇచ్చిన 25 ఏళ్ల కాలపరిమితి పొడిగింపు రాజ్యాంగ విరుద్ధమని గురువారం అర్ధరాత్రి వెలువరించిన తీర్పులో కోర్టు పేర్కొంది. అమెరికా ఒత్తిడితో పాటు ఒప్పందంలో జరిగిన భారీ అవినీతి అక్రమాల నేపథ్యంలో వెలువడిన ఈ సంచలన తీర్పు ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో వ్యూహాత్మక జలమార్గంపై చైనా పట్టును అడ్డుకోవాలన్న అమెరికా లక్ష్యం నెరవేరినట్లయింది.

అమెరికా జాతీయ భద్రతా అంశం

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పనామా కాలువలో చైనా జోక్యాన్ని అడ్డుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా పనామాను సందర్శించి, ఈ ఓడరేవుల నిర్వహణను అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. కాలువ నియంత్రణను తిరిగి అమెరికా చేతుల్లోకి తీసుకోవాలని కూడా ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు.

ఆడిట్‌లో విస్తుపోయే నిజాలు

పనామా కాంప్ట్రోలర్ జనరల్ అనీల్ ఫ్లోర్స్ నిర్వహించిన ఆడిట్‌లో ఈ పోర్ట్ ఒప్పందానికి సంబంధించిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో ఒప్పందాన్ని పొడిగించినప్పటి నుండి ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,500 కోట్లు) బకాయిలను సదరు కంపెనీ చెల్లించలేదని ఆడిట్ వెల్లడించింది. కేవలం ఇది మాత్రమే కాకుండా, 1997లో మొదటిసారి కాంట్రాక్ట్ తీసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాకు సుమారు 1.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10,000 కోట్లు) భారీ నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది. పోర్టుల నిర్వహణలో తీవ్రమైన అకౌంటింగ్ తప్పులు జరగడమే కాకుండా, 2015 నుంచి పోర్టుల లోపల 'ఘోస్ట్' (నకిలీ) కన్సెషన్ల పేరిట అక్రమ దందాలు సాగుతున్నాయని ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది.

తీవ్రంగా స్పందించిన చైనా

కోర్టు తీర్పుపై హాంకాంగ్ కుబేరుడు లీ కా-షింగ్ నేతృత్వంలోని సీకే హచిసన్ సంస్థ మండిపడింది. ఈ నిర్ణయానికి చట్టపరమైన ఆధారం లేదని, ఇది వేలాది మంది కార్మికుల కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు, బీజింగ్‌లో చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమ కంపెనీల ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ముందున్న సవాలు

ప్రస్తుతానికి ఓడరేవుల నిర్వహణ ఆగదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ పోర్టులను ఇకపై ఎవరు నడుపుతారనే అంశంపై స్పష్టత లేదు. గతంలో ఈ కంపెనీ తన వాటాను అమెరికాకు చెందిన 'బ్లాక్‌రాక్' సంస్థకు అమ్మాలని ప్రయత్నించగా, చైనా ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ పోర్టుల నిర్వహణ బాధ్యతను పనామా సముద్ర వ్యవహారాల సంస్థ తిరిగి వేలం వేసే అవకాశం ఉంది. అమెరికాకు అనుకూలమైన సంస్థలు ఈ రేసులో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.