
పెన్షన్ డబ్బుల కోసం దారుణం
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి సంరక్షణ బాధ్యతలు పట్టించుకోని కొడుకు, తిరిగి తల్లి తన పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని అతికిరాతకంగా హతమార్చిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ లోని మిట్టకోడూరు గ్రామానికి చెందిన మల్లమ్మ (57) తన ఇద్దరు కొడుకుల వద్ద చిల్లి గవ్వ ఆశించకుండా ఆశించకుండ, కొడుకులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో జీవితం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మద్యానికి బానిసైన మల్లమ్మ పెద్ద కొడుకు అంజయ్య ఎటువంటి సంపాదన లేక ఆఖరికి తన తల్లి పెన్షన్ డబ్బులకు కోసం తరుచూ గొడవ పడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి బాగా తాగి వచ్చి మరోసారి తల్లితో పెన్షన్ డబ్బుల విషయమై గొడవకు దిగాడు. మల్లమ్మ తన పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మద్యం మత్తులో కోపంతో అంజయ్య కర్రతో దాడి చేశాడు. దెబ్బ బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమై మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
మరోవైపు స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అంజయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇక మల్లమ్మ చిన్న కొడుకు మైపాల్ ఫిర్యాదు ఆధారంగా పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు జరిపిన విచారణలో అంజయ్య తన తల్లి పెన్షన్ డబ్బు కోసం తానే హత్య చేశానని నేరం అంగీకరించాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.
తల్లి ప్రేమ వెల కట్టలేనిది, ఆమె త్యాగాలకు మరేదీ సాటి రాదు. అలాంటిది తమ స్వార్థంతో, కేవలం డబ్బు కోసం కన్నతల్లిని హతమార్చిన ఈ ఘటన మానవత్వం ఎంతగా దిగజారిందో తెలియజేస్తుంది. ఈ ఘటన సమాజంలో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యానికి, ఆర్థిక స్వార్థానికి అద్దం పడుతోంది.
