
పదేళ్లలో ‘స్టార్టప్ ఇండియా’ మహా విప్లవంగా మారింది: ప్రధాని మోడీ
దేశంలో కొత్త ఆలోచనలతో అడుగులు వేస్తున్న యువతకు ‘స్టార్టప్ ఇండియా’ ఒక వరంలా మారిందని, గత పదేళ్లలో ఇది ఒక మహా విప్లవంగా రూపాంతరం చెందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్టార్టప్ ఇండియా పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
నాడు అడ్డంకులు.. నేడు ఆకాశమే హద్దు
పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితులను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. "పదేళ్ల క్రితం దేశంలో కొత్త ఆలోచనలు, వ్యక్తిగత ఆవిష్కరణలకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదు. అటువంటి క్లిష్ట పరిస్థితులను సవాలు చేస్తూ మనం ‘స్టార్టప్ ఇండియా’ను ప్రారంభించాం. యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలను కల్పించాం. దాని ఫలితం నేడు కళ్లముందే ఉంది" అని ప్రధాని అన్నారు. ఈ పదేళ్ల ప్రయాణం కేవలం ఒక ప్రభుత్వ పథకం విజయం మాత్రమే కాదని, లక్షలాది మంది యువత కన్న కలల సాకారమని ఆయన అభివర్ణించారు. కొత్త కలలు కనే ధైర్యం చేసిన ప్రతి యువ ఆవిష్కర్తను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
స్టార్టప్ రంగంలో మహిళా శక్తి
భారత స్టార్టప్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరగడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో దాదాపు 45 శాతం కంపెనీల్లో కనీసం ఒక్కరైనా మహిళా డైరెక్టర్ లేదా పార్టనర్ ఉన్నారని ఆయన వెల్లడించారు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు పెట్టుబడులు అందడంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ఈ పెరుగుతున్న మహిళా శక్తి దేశ సామర్థ్యాన్ని మరింత పెంచుతోందని, భారతదేశ భవిష్యత్తు ఈ స్టార్టప్ విప్లవంలోనే కనిపిస్తోందని మోడీ స్పష్టం చేశారు.
ఉద్యోగాల వేట నుంచి.. ఉద్యోగాల కల్పన వైపు
యువత కేవలం ఉద్యోగాల కోసం వెతకడం కాకుండా, ఉద్యోగాలను సృష్టించేవారుగా మారాలనే లక్ష్యంతో 2016 జనవరి 16న ప్రధాని మోడీ ‘స్టార్టప్ ఇండియా’కు శ్రీకారం చుట్టారు. కొత్త ఆవిష్కరణలను పెంపొందించడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. కాగా ఈ పథకం ప్రారంభమైన పదేళ్లలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించడం విశేషం.
