
పది, ఇంటర్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని, 100 శాతం ఫలిత సాధనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.
వెలగపూడి సచివాలయం నుండి సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్లతో మంత్రి జూమ్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, హాస్టళ్ల నిర్వహణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమీక్షలోని ముఖ్యాంశాలు:
ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటుచేసి విద్యార్థులు వెనుకబడిన సబ్జెక్టులను గుర్తించి, ట్యూటర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని మంత్రి సూచించారు. విద్యార్థుల చేత 'రైజింగ్ స్టార్', 'షైనింగ్ స్టార్' పుస్తకాలను చదివించాలని ఆదేశించారు. హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ, కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయించాలని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ ఇబ్బంది కలగకుండా, ప్రతి జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని మంత్రి నిర్ణయించారు. హాస్టళ్లలో మెనూ అమలు, వార్డెన్ల పనితీరు, పారిశుధ్యంపై నేరుగా విద్యార్థుల నుండే ఐవిఆర్ఎస్ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
చరిత్రలో మొదటిసారిగా అవుట్‌సోర్సింగ్ ద్వారా హాస్టళ్లలో శానిటేషన్ వర్కర్లను నియమిస్తున్నామని, అన్ని వసతి గృహాల్లో ఆర్‌ఓ ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పీఎం అజయ్ పథకం కింద రాష్ట్రంలో రూపుదిద్దుకుంటున్న 26 నూతన హాస్టల్ భవన నిర్మాణాలను డీడీలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి (IAS)తో పాటు అన్ని జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
