
పదోవంతు నీళ్లు కూడా ఇవ్వరా?
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న ప్రాజెక్టుల నిర్వహణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ వరకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రూ.84 వేల కోట్లు అయితే, కేవలం తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రూ.35 వేల కోట్లు కేటాయించడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతుందని హరీశ్ రావు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు పదో వంతుకు కూడా నీటిని అందించడం లేదని విమర్శించారు. రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరో నిదర్శనమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఈ కొత్త ప్రాజెక్టులో కేవలం 80 టీఎంసీల నీటి వినియోగం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలిస్తే మూడో వంతు ఖర్చుతో పదో వంతుకు కూడా నీళ్లు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తలపెట్టడాన్ని ఉద్దేశించి "ఇది కదా అసలైన మార్పంటే?" అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.
