
పదేళ్లలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది
పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ముంబైలో ఎన్డీటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రపంచంలోనే అమెజాన్ కు అతి పెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో ఉందన్నారు. టీ-హబ్ ను నిర్మించామన్నారు. అలాగే ప్రపంచంలోనే పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని పూర్తి చేశామన్నారు. కేవలం పది సంవత్సరాల కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్దిని సాధించిందన్నారు. మరి కేవలం ఒక దశాబ్దంలో తెలంగాణ ఇంత అభివృద్ది సాధిస్తే దేశం ఎందుకు అభివృద్ది దిశగా పోవడం లేదని ప్రశ్నించారు.
చైనా, జపాన్ దూసుకుపోతున్నాయి.
గతంలో చైనా, జపాన్ దేశాలు అభివృద్ధిలో మనకంటే వెనుకబడి ఉండేవి. కానీ నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయని కొనియాడారు. అన్ని రకాల ప్రకృతి విపత్తులను తట్టుకుని వేగంగా ప్రగతిపథంలో వెళుతున్నాయన్నారు. మరి ఇండియా ఎందుకు అభివృద్ధి చెందడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ యువత ఆశలు ఆకాశాన్ని తాకుతుంటే భారత ప్రభుత్వం మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అని పక్క దేశాలపై ఆరోపణలతో ఆగిపోతోందన్నారు. ఆ దేశాలతోనే పోటీ పడుతోందని, వాటితో పోల్చుకొని సంతృప్తి చెందుతున్నామని చెప్పారు. చైనా, జపాన్ తో ఎప్పుడు పోటీపడలేదని, ఎంతసేపు మందిర్, –మసీద్, ఈరోజు ఏం వారం? ఏం తినాలే, వీటి చుట్టే తిరిగితే అభివృద్ధి ఎప్పుడు చేస్తారని అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను మభ్యపెట్టడంలో విజయవంతం అయ్యారని, దేశ భవిష్యత్ ను గాలికొదిలేశారని విమర్శించారు. ఎల్లకాలం మత రాజకీయాలే చేస్తూ పోతే ప్రజలకు కూడా విసుగొస్తుందని, కావాల్సింది మతాలు కాదు, అభివృద్ది అని తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని జోస్యం చెప్పారు.
నేపాల్ తరహా ఉద్యమం
ప్రజల, యువత అకాంక్షలను నెరవేర్చడంలో భారత ప్రభుత్వం విఫలమైతే కచ్చితంగా ఇక్కడ కూడా నేపాల్ జెన్ జెడ్ తరహా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. నేపాల్ లో యువత గొంతు నొక్కడం, సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగిందన్నారు. అలాగే తెలంగాణలో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుమారు 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయబోతుంటే అక్కడి యువత అడ్డుకుని కాపాడుకున్నారన్నారు. నిరసనలు తెలిపి, సోషల్ మీడియాలో యుద్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు.
