
పేదల కష్టాలు ప్రభుత్వానికి కనిపించవా?
గత నాలుగు రోజులుగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో చిరు వ్యాపారులపై జీవీఎంసీ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని దుర్మార్గంగా దాడులు చేయిస్తున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారుల బడ్డీలను, తోపుడు బండ్ల కూల్చివేతలను తక్షణం నిలిపి వేసి వారికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ వైసిపి ఆధ్వర్యంలో జి.వి.ఎం.సి. గాంధీ విగ్రహం నుండి జి.వి.ఎం.సి ప్రధాన కార్యాలయం వరకు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జీవీఎంసీ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా క్రేన్లు, జెసిబిలతో చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించడం అన్యాయం అన్నారు. చిరు వ్యాపారుల బ్రతుకు జీవనాన్ని కూల్చివేస్తూ కూటమి ప్రభుత్వం దుర్మార్గ చర్యలకు పూనుకుంటుందని మండిపడ్డారు. చిరు వ్యాపారస్తుల తోపుడు బండ్లపై దాడులను వైసీపీ ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తొలగిస్తున్న తోపుడు బండ్లలో కొన్నిటికి గతంలో జీవీఎంసీ అధికారులు గుర్తింపు కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ అనాధికార తొలగింపు వలన 40 వేలకు పైగా చిరు కుటుంబాలు ఉపాధి కోల్పోయి నేడు రోడ్డున పడ్డారని విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారస్తులను చేయూత పథకం ద్వారా ఆదుకుందని, కానీ పేదవాడు పేదవాడిగానే ఉండాలనేది చంద్రబాబు కోరిక అని విమర్శించారు. కూటమి ఎమ్మెల్యేలు, మేయర్‌కి పేద ప్రజల కష్టాలు కనబడటం లేదా, సామాన్య ప్రజలపై దాడులు ధర్మమేనా అని ప్రశ్నించారు.
కూటమి ఎమ్మెల్యేలు తక్షణమే చిరు వ్యాపారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ అభివృద్ధి నోచుకుంటే అమరావతి వైపు ఎవరు చూడరని, దత్త పుత్రిక లాంటి అమరావతిని అభివృద్ధి చేయడమే ఈ దాడులకు ప్రధాన కారణం అని తెలిపారు. తమ ప్రభుత్వం పేదవాడికి వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లు, ఇంటికే రేషన్ వేన్ల ద్వారా సరుకులు పంపిణీ చేసి, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. విశాఖలో పరిశ్రమలు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారని, వచ్చే వన్నీ బోగస్ పెట్టుబడులు అని ఎద్దేవా చేశారు. ఎక్కడ తొలగించిన దుకాణాలు అక్కడే తిరిగి వ్యాపారం చేసుకునేలా చర్యలు చేపట్టి, కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిన దుకాణాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పేదలకు అండగా ఉంటూ చిరు వ్యాపారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మోల్లి అప్పారావు, జిల్లా వాణిజ్య భాగం అధ్యక్షులు సంకాబత్తుల ప్రసాద్, జిల్లా వైసీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు కర్రి రామారెడ్డి, కార్యదర్శి శిరపు దివాకర్ రెడ్డి, జిల్లా వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
