
పెద్దల మాట.. చద్దిమూట
ఒకప్పుడు కుటుంబం అంటే, ఇంట్లో కనీసం పది, ఇరవై మంది ఉండాల్సిందే. అమ్మానాన్న, తాత, బామ్మ, పెద్ద నాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, పిన్ని, అత్త, వదిన, తమ్ముడు, అన్నయ్య, చెల్లి, నాన్నమ్మ, అమ్మమ్మ ఇలా వరసలు చెప్పుకుంటూ పోతే.. ఆ కుటుంబ బంధాల్లోని వరసలు, పిలుపులు ఆ ఇంటి అనురాగానికి, ఆత్మీయ బంధాలకు ప్రతీకగా నిలిచేవి.
మరి ఇప్పుడు ఆ బంధాలు ఏమైనాయి? ఉన్నాయి. కానీ దూరంగా జరిగిపోయాయి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు నేడు తలో దిక్కుగా వేరుపడి.. నాటి బంధాలన్నీ విచ్ఛిన్నమైపోయాయి. కానీ తరం మారినా స్వరం మారకూడదు. నాటి తరం దూరంగా అనివార్యంగా మనకు దూరమైపోయినాగానీ మన తర్వాత తరానికి నాటి పెద్దల తరాన్ని దగ్గర చేసేందుకు నేటి తరం కృషి చేయాలి. అందుకే, ఇంటింటి పెద్దల అనురాగాన్ని గుర్తు చేసుకుందాం! ఆ పెద్దల ఆలింగనాల్లో కలిగే మురిపాల అనుభూతుల్ని పెనవేసుకుందాం!!
ఏదీ నిన్నటి అనుభవాల సారాంశం:
మన సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం ఓ సంప్రదాయం. “తాత చెప్పిన మాట, బామ్మ చెప్పిన పాట” అన్నది సామెత మాత్రమే కాదు, ఆత్మీయ అనుభవాల సారాంశం కూడా. పెద్దలు చెప్పే మాటల్లో అనుభవం దాగి ఉంటుంది. వారు పంచే కథల్లో జ్ఞానం దాగి ఉంటుంది. వారు నడిచిన దారులు కొత్త తరాలకు పాఠాలుగా మారతాయి. నేటి వేగవంతమైన జీవితంలో తాత, బామ్మల స్థానం క్రమంగా పక్కకు వెళ్ళిపోతుందనేది వాస్తవం. అది మన కళ్లముందే స్పష్టంగా కనపడుతోంది. ఈ తరం వారికి అది అనుభవం కూడా. అణువణువునా ఆధునికత ప్రవహిస్తున్న ఈ యుగంలో కుటుంబ సంబంధాలు క్రమంగా శిథిలమవుతున్నాయి. తాత–బామ్మలు ఒకప్పుడు కుటుంబానికి కేంద్రమైనప్పుడు, నేడు చాలా చోట్ల వారిని పక్కబెట్టే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ఒక తరం సమస్య మాత్రమే కాదు, సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సవాలు.
భవిష్యత్ తరానికి కవచంలా!
తాతలు, బామ్మలు పిల్లలకు ఇచ్చే ప్రేమ అనన్యమైనది. తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పుడు వారే మనవళ్లను సంరక్షిస్తారు. ఆ మమకారమే పిల్లలకు మానసిక బలాన్ని ఇస్తుంది. కథల రూపంలో వారు చెప్పే నీతులు పిల్లల్లో విలువలను పెంపొందిస్తాయి. మన చరిత్ర, సంస్కృతి, ఆచారాలను వారు జీవన విధానంలో కలిపి చూపుతారు. స్వీయానుభవాలతో అర్ధమయ్యేలా వివరిస్తారు. మన పెద్దల సారధ్యం లేకుంటే, కొత్తతరం వేరుపడి పోవడం ఖాయం. అందుకే, ఏ కుటుంబంలోనైనా కనీసం ఒక్కరైనా పెద్దవారు ఉంటే.. ఆ కుటుంబంలోని పిల్లలందరికీ ప్రత్యక్షంగా, పరోక్ష్క్షంగా ఆ పెద్దలు భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులుగా, చెడు నుంచి మళ్ళించే రక్షణ కవచమవుతారనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు.
వయోధిక ఆశ్రమాలు కాదు కావాల్సింది
నవీన సమాజంలో ఎక్కడైనా వృద్ధాశ్రమాలు కనపడకపోతే అదొక వింత నగరంగానో, వింత పట్టణంగా చూసే పరిస్ధితి ఏర్పడింది. పెద్దల్ని కుటుంబం నుంచి వేరు చేసి వేరే చోట అద్దె
గృహాలైన వృద్ధాశ్రమాలకు తరలించడం ఇప్పుడు సర్వసాధారనమైంది. మనల్ని ఎక్కడో దాచిపెట్టే ఇలాంటి వృద్ధాశ్రమాల మాట మనకు కొత్తేం కాకపోయినాగానీ, ఆ మాట మన సమాజంలో సర్వసాధారణమై పోయినా, ఎక్కడో ఒకచోట వాటిని త్యజించుకోవాలి, నివారించుకోవాలి అనే సానుకూల ఆలోచన ప్రతి కుటుంబంలో రావాలి. మనల్ని కనీపెంచిన తల్లితండ్రుల్ని, సన్మార్గపు మాటలు, ఆటలు, పాటలు, లాలనతో మనందరికీ చద్దిమూటల్ని పంచిపెట్టిన తాత, బామ్మల వానప్రస్ధ జీవితం మనతోనే హాయిగా గడపాలనే ధ్యాస మనలో పెంచుకోవాలి. మన పిల్లలకు కూడా మన పెద్దల గొప్పతనం తెలిసేలా నిత్యం ప్రయత్నం చేయాలి. ఇది అందరి బాధ్యత. అంతేకాదు, రేపటి భవిష్యత్తును దృష్టిలోపెట్టుకుని, భావితరాల మనుగడ కోసం ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు కూడా తాత, బామ్మల ప్రాధాన్యాన్ని గుర్తించి, వారికి అనుకూలమైన కార్యక్రమాలు చేపట్టాలి. వృద్ధులకు సదుపాయాలు కల్పించడం మాత్రమే కాదు, వారిని కుటుంబానికి, సమాజానికి అనుసంధానించే ప్రయత్నాలు అవసరం. పాఠశాలల్లో అనువైన రోజుల్లో ‘గ్రాండ్పేరెంట్స్ డే’ , ఎల్డర్స్ వంటి వినూత్న కార్యక్రమాలు జరిపించడం ద్వారా మన పిల్లలు కూడా మన పెద్దల అనుభవాలను పంచుకోవడానికి చక్కటి అవకాశం లభించినట్టు అవుతుంది
ఇలా ఆట, పాటల సమ్మేళనంగా మన పెద్దల్ని గుర్తించుకోవడం, వారిని గౌరవించడం, వారు చెప్పే చల్లని మాటలు, అనుభవాలు పదే పదే వినడం, వారితో గడపడం ద్వారా కుటుంబ బంధాలను మరింత బలపడతాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న మన పిల్లలు కూడా మన పెద్దల ఒడిలో పెరుగుతూ పెద్దల మాటను చద్దిమూట చేసుకుని ఉన్నతంగా ఎదుగుతారు.
