
పాత పగే ప్రాణం తీసింది
పుట్టినరోజు అనగానే సంతోషం, నవ్వులు, కేక్ కటింగ్ గుర్తుకు వస్తాయి. కానీ అదే పుట్టిన రోజు వేడుక ఓ యువకుడికి చివరి పుట్టిన రోజుగా మారింది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ చివరికి ఆ యువకుడి మరణానికి కారణమైంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
స్నేహితుడి చేతిలో మృతి చెందిన యువకుడిని పోలీసులు యశ్ దేవేంద్ర ఢాకా (22)గా గుర్తించారు. ఈ ఘటన జనాలు ఎక్కువగా ఉండే మేన్ కాంప్లెక్స్ వద్ద జరగడం గమనార్హం. అక్కడ ఎప్పుడూ షాపింగ్‌కి వచ్చే వారు, వ్యాపారాలు చూసుకునే వారు ఉండటంతో బాగా రద్దీగా ఉంటుంది. ఆ ప్రదేశంలో హత్య జరగడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.
పోలీసుల సమాచారం ప్రకారం యశ్ ఢాకా పుట్టిన రోజు వేడుకల్లో తన స్నేహితుడు సూరజ్ అప్పాసాహెబ్ కాటే (21)తో తగాదా ఏర్పడింది. ఆ గొడవ కాస్త మాటల యుద్ధంగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ ఘర్షణలో కాటే తన వద్ద ఉన్న కత్తితో ఢాకా ఛాతీలో పొడిచాడు. కాగా గాయపడిన ఢాకాను అక్కడున్నవారు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యులు ఢాకా అప్పటికే చనిపోయాడని ప్రకటించారు.
మరోవైపు ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. తరువాత అతడిని శివాజీనగర్ పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో ఢాకా, కాటేల మధ్య పలు కారణాలతో సుమారు నెల రోజుల నుంచి వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయని తేలింది. స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ఈ పాత కక్షలను మనుసులో పెట్టుకొని కాటే హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది.
