
పత్తి రైతుల సమస్యలపై సీసీఐ చైర్మన్‌తో సమావేశం: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల, ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తూ, ముంబైలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రధాన కార్యాలయంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తా ను కలిసిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతుల ఆవేదనను ప్రతిబింబించే లేఖను కూడా ఆయనకు అందజేశారు.
తెలంగాణలో పత్తి పంట సాగు విస్తీర్ణం ఈ సీజన్‌లో 45 లక్షల ఎకరాలకు పైగా నమోదైందని, అయితే అకాల వర్షాలు, ప్రభావం, పురుగు దాడులు, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయని తెలిపారు. కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ, మార్కెట్‌లో రైతులు ఆ ధరను పొందడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి రైతులకు రక్షణ కల్పించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
సీసీఐకి సమర్పించిన డిమాండ్లు
ఈ సంక్షోభ సమయంలో తెలంగాణ పత్తి రైతులను ఆదుకునేందుకు సీసీఐ వెంటనే క్రింది చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు.
కనీస మద్దతు ధర పెంపు: ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, రైతుల ఉత్పత్తి వ్యయాలకు అనుగుణంగా కనీస మద్దతు ధరను పెంచాలని కోరారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: ప్రతి పత్తి సాగు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులు నేరుగా తమ పత్తిని సీసీఐకి విక్రయించే సదుపాయం కల్పించాలని సూచించారు.
గత సీజన్ల బకాయిల చెల్లింపు: గత సీజన్లలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.
ప్రత్యేక సహాయక ప్యాకేజీ: అకాల వర్షాలు, పురుగు దాడులు, తక్కువ ధరల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
పురుగు నిరోధక విత్తనాల పరిశోధన: భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పురుగు నిరోధక విత్తనాల అభివృద్ధిపై పరిశోధన, పంపిణీ బలోపేతం చేయాలని కోరారు.
తెలంగాణ పత్తి రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం అలాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
