Let's talk: editor@tmv.in
పత్తిలో తేమ 12 శాతం మించకుండా చూసుకోవాలి: మంత్రి తుమ్మల

పత్తిలో తేమ 12 శాతం మించకుండా చూసుకోవాలి: మంత్రి తుమ్మల

Gaddamidi Naveen
28 అక్టోబర్, 2025

పత్తి రైతులకు గరిష్ట మద్దతు అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అయితే తేమ శాతంపై రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఒక ప్రకటనలో కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఆయన కీలక సూచనలు చేశారు.

మద్దతు ధరకు ప్రధాన షరతు

రైతులు తమ పత్తిని మార్కెట్ యార్డులకు లేదా జిన్నింగ్ మిల్లులకు తీసుకురావడానికి ముందు తేమ శాతం 12శాతం మించకుండా చూసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. తేమ12 శాతం కంటే ఎక్కువగా ఉంటే, రైతులకు కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని, ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన అని ఆయన తెలిపారు. అందువల్ల, మద్దతు ధర పొందాలంటే ప్రతి రైతు తమ పత్తిలో తేమ శాతాన్ని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని మంత్రి సూచించారు.

తేమ సడలింపు కోసం కేంద్రంపై ఒత్తిడి

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు పండించిన పత్తిలో సహజంగానే తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, కొనుగోళ్లలో ఈ నిబంధనను సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 25, 2025న కేంద్ర ఔషధ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలియజేశారు.కేంద్రం నుంచి అనుమతులు వచ్చేవరకు, రైతులు తమ పత్తిని ఆరబెట్టి తేమ 12శాతం లోపే ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రిజిస్ట్రేషన్, సహాయక బృందాలు

రైతులకు సహాయం అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. కపాస్ కిసాన్ యాప్‌లో పత్తి విక్రయాల కోసం రిజిస్ట్రేషన్ చేయించడానికి ప్రత్యేక అధికార బృందాలు జిల్లాల్లో పర్యటిస్తున్నాయని తెలిపారు. ఏఈవోలు (వ్యవసాయ విస్తరణ అధికారులు), మార్కెట్ సెక్రటరీలు జిల్లా మార్కెటింగ్ అధికారులు రైతులకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటారు. ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే, రైతులు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779 కు కాల్ చేసి స‌మ‌స్య‌లు తెలుసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు.