Let's talk: editor@tmv.in
ప‌తాక స్థాయికి చేరిన ఆన్ లైన్ ఖ‌ర్చు

ప‌తాక స్థాయికి చేరిన ఆన్ లైన్ ఖ‌ర్చు

FL - BRTH
30 సెప్టెంబర్, 2025

దేశంలో ఆన్ లైన్ క్రెడిట్ కార్డు ఖ‌ర్చు ఒక్క‌సారిగా ఊపందుకుంది. ఆన్ లైన్ క్రెడిట్ కార్డు ద్వార వ‌స్తువులు, సేవ‌లు కొనుగోలు చేసిన వారి సంఖ్య ఎప్పుడూ లేనంత స్థాయికి చేరుకుంది. ఈ ఖ‌ర్చు సెప్టెంబ‌ర్ నెల‌లోనే రూ. 1.2ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంటుంద‌నే అంచ‌నా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అత్య‌ధికం. సెప్టెంబ‌ర్ 22 నుంచి కొత్త‌గా అమ‌ల్లోకి వ‌చ్చిన జీఎస్టీ రేట్లు మ‌రింత ఊపునిచ్చాయి. ఆన్ లైన్ క్రెడిట్ కార్డు ఖ‌ర్చు ఒక్క‌రోజులోనే ప‌దివేల కోట్ల‌కు చేరింది. ద‌స‌రా పండుగ సీజ‌న్ రావ‌డంతో ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ‌లు అమెజాన్ , ఫ్లిప్ కార్టులలో షాపింగ్ ఆన్ లైన్ క్రెడిట్ కార్డు ఖ‌ర్చు పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది.

సెప్టెంబ‌ర్ 26, 2025 నాటికి ఆన్ లైన్ క్రెడిట్ కార్డు ద్వార చేసే ఖ‌ర్చు రూ.1.3 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంది. ఇంకా నాలుగు రోజుల పాటు కొనుగోలుకు అవ‌కాశం ఉండ‌టంతో దాదాపు రూ.1.15 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.1.2ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఆన్ లైన్ క్రెడిట్ కార్డు ఖ‌ర్చు ఉండే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇదే ఆన్ లైన్ క్రెడిట్ కార్డు ఖ‌ర్చు అక్టోబ‌ర్ 2024లో రూ.1.06 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంది. గ‌త ఏడాది ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌లు అక్టోబ‌ర్ నెల‌లో వ‌చ్చాయి. కానీ ఆన్ లైన్ అమ్మ‌కాలు మాత్రం సెప్టెంబ‌ర్ లోనే మొద‌ల‌య్యాయి. సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ 2024లో ఆన్ లైన్ క్రెడిట్ కార్డు ఖ‌ర్చు ల‌క్ష కోట్లు దాటింది.

ప్ర‌జ‌లు ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన‌ప్పుడు చెల్లించ‌డానికి డెబిట్ కార్డు బ‌దులు క్రెడిట్ కార్డునే ఎక్కువ‌గా వాడుతున్నారు. ఆన్ లైన్ చెల్లింపుల‌కు డెబిట్ కార్డుల వినియోగం గ‌త ఏడాది అక్టోబ‌ర్ కంటే త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఆన్ లైన్ ఆఫ‌ర్ల కోసం ఎక్కువ‌గా క్రెడిట్ కార్డు వినియోగిస్తున్న‌ట్టు ఈ గ‌ణాంకాలు చూసిన త‌ర్వాత అర్థ‌మ‌వుతోంది. ఆన్ లైన్ డెబిట్ కార్డు ఖ‌ర్చు అక్టోబ‌ర్ 2024లో రూ.14,300 కోట్లు ఉంటే.. ఈ ఏడాది రూ. 11000 కోట్ల‌కు త‌గ్గింది. వివిధ బ్యాంకులు, కంపెనీల బ్రాండ్లు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు విరివిగా అందుబాటులోకి తీసుకురావ‌డం కారణంగా క‌స్ట‌మ‌ర్లు క్రెడిట్ కార్డులను ఉప‌యోగించ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు.

ప‌తాక స్థాయికి చేరిన ఆన్ లైన్ ఖ‌ర్చు - Tholi Paluku