
పాతబస్తీ లండన్ బ్రిడ్జికి కొత్త జీవం
బహుశా చాలామందికి తెలియకపోవచ్చు.. కానీ హైదరాబాద్‌లో ఒక చిన్న బ్రిడ్జికి "లండన్ బ్రిడ్జ్" అనే పేరుంది! ఇది యాకుత్‌పురా నియోజకవర్గంలో ఉంది. దీన్ని మురికి నాలా మీద నిర్మించారు. ఎస్సార్టీ కాలనీ, మదీనా నగర్ ప్రాంతాల మధ్య ఇది వారధిగా ఉంది. ఇది ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన వంతెన. ఈ వంతెన పాతబస్తీలోని ప్రజల జీవితంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, వంతెన చిన్నదే అయినా స్థానిక ప్రజలు రోజువారీ జీవన మార్గానికి ముఖ్యమైన భాగంగా నిలిచిపోయింది. ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ప్రమాదకరంగా మారింది.
ఈ బ్రిడ్జి నుంచి రైల్వే బ్రిడ్జి వరకు పక్కనే ఉన్న నాలా రీటైనింగ్ వాల్ సైతం దెబ్బతిన్నది. దీని వల్ల కూడా ప్రమాదాలకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటితో పరిసర ప్రాంతాల ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. కావున ప్రమాదాలు జరగకముందే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ చేసిన విజ్ఞప్తి మేరకు జీహెచ్‌ఎంసీ మెయింటెనెన్స్, ప్రాజెక్ట్స్ విభాగాల చీఫ్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ బ్రిడ్జ్ పునరుద్ధరణ పనులకు దాదాపు రూ. 2.95 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
అలాగే వివరణాత్మక డిజైన్లు, అంచనాలు, పెట్టుబడుల కోసం కన్సల్టెంట్ నియామకానికి సిద్ధమయ్యారు. ఈ నిర్మాణాన్ని లండన్ బ్రిడ్జి అనే పేరుకు తగినట్టుగా ఆకర్షణీయంగా నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సూచించారు. బ్రిడ్జి రెండు వైపులా ఉన్న అప్రోచ్ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీకి ఆమోదం కోసం పంపించనున్నారు. మంగళవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
