Let's talk: editor@tmv.in
పతకాలు తక్కువే… కానీ ఆశలు మాత్రం ఎక్కువ: భారత కుస్తీ 2025 రివ్యూ

పతకాలు తక్కువే… కానీ ఆశలు మాత్రం ఎక్కువ: భారత కుస్తీ 2025 రివ్యూ

Praveen Kumar
24 డిసెంబర్, 2025

2025 సంవత్సరం భారత కుస్తీకి కాస్త కఠినమైన ఏడాదిగానే నిలిచింది. సీనియర్ స్థాయిలో ఆశించినంత విజయాలు రాకపోయినా, యువ కుస్తీపటువుల ప్రదర్శన మాత్రం రాబోయే రోజులకు ఆశ చూపించింది. పతకాలు తక్కువగా రావడం ఒకవైపు అయితే, బరువు సమస్యలు, నిషేధాలు, పరిపాలనా గందరగోళం మరోవైపు భారత కుస్తీని ఇబ్బంది పెట్టాయి.

సీనియర్ ప్రపంచ కుస్తీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. మొత్తం పోటీల్లో ఒక్క పతకం మాత్రమే దక్కింది. ఆ ఒక్క పతకాన్ని తెచ్చింది మహిళల 53 కిలోల విభాగంలో పోటీపడిన హర్యానా యువతి అంటిమ్ పాంగల్. కఠినమైన పోటీల మధ్య ఆమె కాంస్య పతకం గెలిచి దేశానికి పరువు నిలిపింది. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకుని పోరాడే ఆమె శైలి మరోసారి అందరి ప్రశంసలు పొందింది.

అంటిమ్ ఏడాది పొడవునా స్థిరంగా ఆడింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడో స్థానం సాధించిన ఆమె, ఏడాది చివర్లో జరిగిన జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం గెలిచింది. ముఖ్యంగా తాను ఆడే బరువు విభాగాన్ని 53 కిలోల నుంచి 55 కిలోలకు మార్చినా కూడా అదే స్థాయిలో ఆడటం ఆమె ప్రత్యేకతగా నిలిచింది. 2025లో భారత కుస్తీలో అత్యంత నమ్మకమైన ఆటగాడిగా ఆమె పేరు నిలిచింది.

ఇతర సీనియర్ కుస్తీపటువుల విషయానికి వస్తే, చాలా మంది తక్కువ తేడాతో మ్యాచ్‌లు కోల్పోయారు. చివరి క్షణాల్లో పట్టుదల, ధైర్యం కొరవడడం భారత్‌కు పెద్ద సమస్యగా కనిపించింది. అయితే ఆసియా స్థాయిలో మాత్రం మహిళల 62 కిలోల విభాగంలో మనీషా భన్వాలా స్వర్ణ పతకం గెలిచి కొంత ఊరటనిచ్చింది.

ఈ ఏడాది భారత కుస్తీలో ఎక్కువగా చర్చకు వచ్చిన పేరు అమన్ సెహ్రావత్. గత ఏడాది ఒలింపిక్స్‌లో పతకం గెలిచి దేశానికి హీరోగా మారిన అమన్, ఈ ఏడాది మాత్రం తీవ్ర నిరాశను ఎదుర్కొన్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరువు మించడంతో అతడిని అనర్హుడిగా ప్రకటించడమే కాకుండా నిషేధం కూడా విధించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆటగాళ్లను సరైన విధంగా పర్యవేక్షించడంలో లోపాలు ఉన్నాయని ఈ ఘటన బయటపెట్టింది. తర్వాత కుస్తీ సమాఖ్యకు అమన్ నిరుపాధిక్షమాపణ చెప్పడంతో అతడిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు.

పురుషుల విభాగంలో మరో యువ కుస్తీపటువు సుజీత్ కల్కల్ మంచి ఆశలు రేకెత్తించాడు. 65 కిలోల విభాగంలో అతడి ఆటతీరు ఆకట్టుకుంది. ఒకప్పుడు ఈ విభాగం బజరంగ్ పునియాకే పరిమితమై ఉండగా, ఇప్పుడు సుజీత్ తనదైన గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. భవిష్యత్తులో అతడు భారత్‌కు కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉందని కోచ్‌లు భావిస్తున్నారు.

మహిళల కుస్తీలోనూ సమస్యలు లేకపోలేదు. అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరువు మించడంతో నేహా సంగ్వాన్‌పై నిషేధం పడింది. అలాగే భారీ బరువు విభాగంలో మంచి ఆశగా భావించిన రీతికా హూడాపై డోపింగ్ కేసు నమోదై ఆమెను పోటీల నుంచి తప్పించారు. ఇది ఆ విభాగంలో భారత్‌కు పెద్ద లోటుగా మారింది.

అయితే ఈ అన్ని సమస్యల మధ్య భారత కుస్తీకి అసలు బలం జూనియర్ స్థాయిలో కనిపించింది. అండర్-23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సుజీత్ స్వర్ణ పతకం గెలిచాడు. అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ అనేక పతకాలు సాధించి అగ్ర దేశాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం 17 ఏళ్ల కాజల్ స్వర్ణ పతకం గెలవడం విశేషం. తపస్య గహ్లావత్ కూడా అగ్రస్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో ప్రియా మాలిక్, సారిక, శృతి, రీనా పతకాలు సాధించగా, పురుషుల విభాగంలో సుమిత్ మాలిక్, సూరజ్ కూడా మెడల్స్ గెలిచారు. ఈ ఫలితాలు భారత కుస్తీకి రేపటి మీద నమ్మకం పెంచాయి.

మరోవైపు వినేశ్ ఫోగట్ తిరిగి కుస్తీకి రావాలన్న నిర్ణయం కూడా చర్చకు వచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో కేవలం 100 గ్రాముల బరువు తేడాతో పతకం కోల్పోయిన వినేశ్, ఇప్పుడు మరోసారి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం హర్యానాలో ఎమ్మెల్యేగా ఉన్న ఆమె, తన కుమారుడి కోసం మళ్లీ పోరాటానికి సిద్ధమవుతోంది. అయితే వయసు, పోటీ, ఎంపిక విధానం వంటి సవాళ్లు ఆమె ముందు ఉన్నాయి.

ఇదిలా ఉండగా కుస్తీ సమాఖ్య కొత్త ఎంపిక విధానాన్ని తీసుకొచ్చింది. జాతీయ శిబిరాల్లో పాల్గొనడం తప్పనిసరి చేయడంతో పాటు, ఒలింపిక్స్ కోటా సాధించినవారికీ ఎంపిక పరీక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇది క్రమశిక్షణ పెంచుతుందా లేక ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతుందా అన్నది చూడాల్సి ఉంది.

కొన్నేళ్ల విరామం తర్వాత ప్రో-రెజ్లింగ్ లీగ్ మళ్లీ ప్రారంభం కానుండటం కూడా మంచి పరిణామంగా భావిస్తున్నారు. యువ కుస్తీపటువులు సీనియర్ స్థాయికి మారే సమయంలో ఇది ఉపయోగపడనుంది. మొత్తంగా చూస్తే 2025లో భారత కుస్తీకి సీనియర్ స్థాయిలో నిరాశ ఎదురైనా, యువత ప్రదర్శన భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తోంది.

పతకాలు తక్కువే… కానీ ఆశలు మాత్రం ఎక్కువ: భారత కుస్తీ 2025 రివ్యూ - Tholi Paluku