Let's talk: editor@tmv.in
'పతంగి' గాలి మళ్లిందా?

'పతంగి' గాలి మళ్లిందా?

T Venkata Ramana
5 అక్టోబర్, 2025

అసాధారణ రాజకీయ పరిణామాలకు వేదికైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. దశాబ్దకాలంగా బీఆర్‌ఎస్‌కు 'మిత్రపక్షం'గా వ్యవహరించిన ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలు పాత స్నేహబంధానికి పురిటి కొచ్చిన సంకేతాలుగా రాజకీయ వర్గాల్లో విశ్లేషణకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు ముద్దుగా ఉన్న బీఆర్‌ఎస్‌ను ఇప్పుడు 'వద్దు' అంటూ ఆయన చేసిన విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడడం వంటి పరిణామాలు గాలి పటం (పతంగి) ఎటువైపు ఎగురుతోందో స్పష్టం చేస్తున్నాయి.

కొత్త స్నేహానికి బాటలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడవచ్చు అనే వాతావరణంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. ఒక దశాబ్దం పాటు బీఆర్‌ఎస్ (గతంలో టీఆర్‌ఎస్) ప్రభుత్వంతో మైత్రీ సంబంధాలను కొనసాగించిన ఎంఐఎం ఇప్పుడు బీఆర్‌ఎస్ పట్ల విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించడం వెనుక రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

అభివృద్ధిపై నిర్లక్ష్యం

పదేళ్లలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గాన్ని మోడల్‌గా మార్చడంలో విఫలమయ్యారని, ఇతర ప్రాంతాలపై చూపిన శ్రద్ధను జూబ్లీహిల్స్‌పై చూపలేదని అసద్ ఆరోపించారు.

చురుకైన స్థానికుడే కావాలని ఎన్నికల్లో చురుకుగా ఉండి, ప్రజల కష్టాలను పట్టించుకునే స్థానిక అభ్యర్థిని ఎన్నుకోవాలని ముస్లిం ఓటర్లకు ఒవైసీ పిలుపునిచ్చారు. ఇది ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా ఎంఐఎం మద్దతు ఇచ్చే అభ్యర్థికే ఓటు వేయాలన్న సంకేతాన్ని పంపుతోంది.

కాంగ్రెస్ వైపు 'పతంగి' చూపు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.92 లక్షల ఓట్లకు గాను ముస్లిం ఓటర్లు సుమారు 96,546 మంది ఉన్నారు. అంటే దాదాపు 25 శాతం వాటా వీరిదే. ఈ గణాంకాలు ఈ ఉపఎన్నికలో ఎంఐఎం పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో స్పష్టం చేస్తున్నాయి. ఎంఐఎం మద్దతు ఎటువైపు ఉంటే గెలుపు అటువైపే మొగ్గు చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి, ఒవైసీ మంత్రాంగం

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాల వేదికలపై అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రితో కలిసి కనిపించారు. పాతబస్తీ మెట్రో రైలు శంకుస్థాపన సందర్భంగా రేవంత్ రెడ్డిని ఒవైసీ ప్రశంసించడం, ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో పెండింగ్ పనుల కోసం ముఖ్యమంత్రిని కలిసి హామీ పొందానని ఒవైసీ స్వయంగా చెప్పడం గమనార్హం. ఈ పరిణామాలు కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఒక 'అంతర్గత అవగాహన' ఏర్పడిందనే వాదనకు బలం చేకూర్చుతున్నాయి. ఎంఐఎం నేరుగా పోటీ చేయకుండా తమ మద్దతు దారులను కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయమని కోరితే కాంగ్రెస్ విజయం తథ్యం అనే అంచనాలు ఉన్నాయి.

కాంగ్రెస్ వ్యూహం

జూబ్లీహిల్స్ గెలుపును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ విజయం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఒక బలమైన సంకేతాన్ని పంపుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులు, ముఖ్య నాయకులతో సమావేశమై సంస్థాగత బలం, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు వివరించాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించేలా వ్యూహాలు సిద్ధం చేశారు.

అభ్యర్థి ఎంపిక

నియోజకవర్గంలోని బలమైన ఆంధ్రా ప్రాంత జనాభాను ఆకర్షించేలా స్థానికులకు ఆమోదయోగ్యమైన బలమైన నేతను రంగంలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మొత్తం మీద జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పోటీ చేస్తుందా లేక గుంభనంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తుందా అనేది త్వరలో తేలనుంది. కానీ బీఆర్‌ఎస్‌పై అసద్ విమర్శలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొనసాగిస్తున్న సాన్నిహిత్యం మాత్రం 'పతంగి' గాలి స్పష్టంగా కాంగ్రెస్ వైపు మళ్లిందనే విషయాన్ని బలంగా చెబుతున్నాయి.

చురుకైన స్థానిక నాయకుడికి మద్దతు

పెళ్లి కొడుకుల్లా వచ్చిపోయే వారిని కాకుండా, చురుకైన, స్థానిక యువకుడిని ఓటర్లు ఎంచుకోవాలని కోరారు. ఎమ్మెల్యే 'మనవాడైతేనే' పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఆటలు సాగనివ్వమని, ఆ పార్టీకి స్థానం లేకుండా చేయాలని మైనారిటీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇది పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు దారితీస్తుందనే చర్చ జరుగుతోంది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనుల జాబితాను తాను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశానని, అభివృద్ధి పనులు త్వరలోనే చేపడతామని సీఎం హామీ ఇచ్చారని అసద్ వెల్లడించారు. ఇది కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య నూతన 'అభివృద్ధి స్నేహం'కు సంకేతంగా ఉంది. సికింద్రబాద్ కంటోన్మెంట్‌లో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, జూబ్లీహిల్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులు, ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమై, సంక్షేమం, అభివృద్ధి ఎజెండాతో ఓటర్లను కలవాలని దిశానిర్దేశం చేశారు.

'పతంగి' గాలి మళ్లిందా? - Tholi Paluku