
పండగ శోభ ప్రతిబింబించాలి
విజయనగరంలో జరిగే శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని , పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ప్రతి దశ లోనూ అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేయాలనీ తెలిపారు. పండగ ఏర్పాట్ల పై కలెక్టర్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అన్ని శాఖలు వారికీ కేటాయించిన విధులను నిబద్ధత తో నిర్వర్తించాలని , సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. వి.ఐ.పి దర్శనాల వలన సాధారణ భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సిరిమాను తిరిగే ప్రదేశం లో ఎక్కడా రోడ్డు పై గుంతలు లేకుండా చూడాలని, అలాగే పారిశుధ్యం, రక్షిత తాగు నీటి సరఫరా , బయో టాయిలెట్స్ ఏర్పాటు , నగరమంతా సుందరీకరణ , విద్యుత్ అలంకరణ తదితర పనులను మున్సిపల్ శాఖ వారు నివహించాలని సూచించారు. పండగ లో ప్లాస్టిక్ ను వినియోగించకుండా చూడాలని, క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేసిన తాగు నీరు పేపర్ గ్లాస్ ల ద్వారా అందించాలని, వాటిని జాగ్రత్తగా వెంటనే తొలగించాలని తెలిపారు. ప్రసాదాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయాలనీ , అలాగే అన్ని ఆర్.ఓ ప్లాంట్ల ను ఆర్.డి.ఓ ఆధ్వర్యం లో తనిఖీ చేయాలనీ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేసి, అత్యవసర చికిత్స కు అవసరమగు మందులను ఏర్పాటు చేయాలనీ అన్నారు. ప్రధానంగా 6,7 తారీఖులలో తోలేల్లు, సిరిమాను ఉత్సవం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వస్తారని, శాంతి భద్రతలకు లోటు లేకుండా చూడాలని పోలీస్ శాఖ వారికీ సూచించారు. వాహనాల పార్కింగ్ కు తగు ఏర్పాట్లను చేయాలనీ, పోలీస్, ఫైర్ శాఖల అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. బారికాడింగ్ ఎత్తు పెంచాలని, లేదంటే పై నుండి దూకి వస్తున్నారని పోలీస్ వారు చేసిన విజ్ఞప్తి మేరకు కలెక్టర్ 4 అడుగుల నుండి 5 అడుగులకు పెంచాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. తెప్పోత్సవం లో గజ ఈతగాళ్ళు ఉండాలని, మత్స్య వారికీ , తెప్పలను తనిఖీ చేసి సర్టిఫికేట్ ఇవ్వాలని ఆర్ అండ్ బి వారికీ సూచించారు.
సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ అక్టోబర్ 1 నుండి 7 వరకు నగరమంతా సుందరీకరణ చేయాలనీ ఎం.ఎస్.ఎం.ఈ మంత్రి సూచించారని, వారి ఆదేశాల మేరకు సోషల్ మీడియా, సుందరీకరణ, ఎల్.ఈ.డి స్క్రీన్ల ఏర్పాటు చేయాలనీ సమాచార శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశం లో అదనపు ఎస్.పి సౌమ్య లత , డి.ఆర్.ఓ శ్రీనివాస మూర్తి, ఆర్.డి.ఓ కీర్తి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శిరీష , పూజారి బంటుపల్లి వెంకట రావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
