Let's talk: editor@tmv.in
పండగ వేళ.. వానొచ్చే.. వరదొచ్చే!

పండగ వేళ.. వానొచ్చే.. వరదొచ్చే!

T Venkata Ramana
24 సెప్టెంబర్, 2025

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఈ నెల 25న ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాబోయే ఐదు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అదనపు వర్షాలు నవరాత్రి, బతుకమ్మ వేడుకలను నిరాశలో ముంచెత్తుతున్నాయి.

గత మూడు రోజుల్లో

గత మూడు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. హైదరాబాద్‌ నగరంలో సాధారణంగా సాయంత్రం వేళల్లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్‌పల్లి, మలక్‌పేట, ఎల్బీనగర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 150 మి.మీ.లకు పైగా వర్షపాతం రికార్డైంది.

అల్పపీడనం ప్రభావం

రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, ప్రజలు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

తెలంగాణలోనూ తప్పని వర్షాలు

తెలంగాణలోనూ రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. నారాయణపేట, మహబూబ్‌నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్‌లో పగటి పూట ఎండ ఉన్నప్పటికీ, సాయంత్రం వేళ కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

పండుగ వేళలో వరుణుడి ప్రతాపం

బతుకమ్మ, దసరా వేడుకల సమయంలో కురుస్తున్న ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను నిరాశకు గురిచేస్తున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే నవరాత్రి ఉత్సవాలకు పూల పండుగ బతుకమ్మకు ఈ వర్షాలు అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు బతుకమ్మను తలపై పెట్టుకుని వీధుల్లో, కూడళ్లలో బతుకమ్మ ఆడుతుంటారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బతుకమ్మ సంబరాలకు అంతరాయం కలుగుతోంది. వర్షం కారణంగా ఇళ్లలోనే బతుకమ్మ ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ సంబరాలపై ఆధారపడిన చిరు వ్యాపారులు కూడా ఈ వర్షాలతో నష్టపోతున్నారు. పూలు, పండ్లు, ఇతర పూజా సామగ్రి విక్రయాలు పడిపోవడంతో వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పండగ సమయంలో ఈ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

పండగ వేళ.. వానొచ్చే.. వరదొచ్చే! - Tholi Paluku