
పట్టపగలే దోపిడీ
కోల్‌కతా ఉత్తర అంచున ఉన్న బరానగర్‌లో ఒక భయంకర ఘటన జరిగింది. పట్టా పగలే బంగారం దుకాణంలో దోపిడీకి దిగిన దుండగులు వ్యాపారిని కట్టేసి, తీవ్రంగా కొట్టి ప్రాణాలు తీశారు. ఈ సంఘటన స్థానికులనే కాకుండా మొత్తం వ్యాపార వర్గాన్నీ షాక్‌కు గురిచేసింది.
కస్టమర్ల వేషంలో దొంగలు
ఈ దాడి పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగింది. మొదట ఇద్దరు వ్యక్తులు కస్టమర్ల్లా దుకాణంలోకి ప్రవేశించి యజమాని శంకర్ జనాతో మాట్లాడటం ప్రారంభించారు. కొన్ని నిమిషాల తర్వాత మరో ఇద్దరు అక్కడికి చేరుకొని అకస్మాత్తుగా దాడి చేశారు. వ్యాపారిని బలవంతంగా కట్టేసి, ప్రాణాలను లెక్క చేయకుండా దారుణంగా కొట్టి గాయపరిచారు. ఈ సమయంలో బయట మరో వ్యక్తి దుకాణం ఎదుట కాపలాగా నిలబడ్డాడు. ఇక దాడి అనంతరం దుండగులు దుకాణంలో ఉన్న బంగారాన్ని సేకరించి అక్కడినుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న శంకర్ జనాను చూసిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే ఆయన ప్రాణాలు విడిచారు.
ఇక పోతే దాడి పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగిందని ఎవరు ఎక్కడ నిలబడాలి ఎవరు లోపలికి వెళ్లాలి అన్నది ముందే నిర్ణయించుకున్నట్లు ఉంది అని బరాక్‌పూర్ పోలీస్ కమిషనర్ మురళీధర్ శర్మ పేర్కొన్నారు. ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించిన సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు అదేవిదంగా పరిసర ప్రాంతాల్లోని కెమెరాలనుంచి కూడా ఆధారాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనలకు గురయ్యారు. మేము ప్రతిరోజూ కష్టపడి వ్యాపారం చేస్తున్నాం కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మాకు భద్రత ఉందనే నమ్మకం ఎలా కలుగుతుంది? అని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు పోలీసులు నిందితులను పట్టుకునేందుకు అనేక బృందాలను ఏర్పాటు చేశారు. పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తుల ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఇది సాధారణ దోపిడీ కాదని పక్కా ప్లాన్ తోనే ఆ వ్యాపారిని హత్య చేశారనే అనుమానాలున్నాయని అయితే త్వరలోనే నిందితులను పట్టుకుంటాం అని ఒక అధికారి ధీమా వ్యక్తం చేశారు.
