
పట్టణ పోరుకు సర్కార్ సై.. ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో సక్సెస్ అయిన కాంగ్రెస్.. ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఓటరు జాబితాల తయారీ, ప్రచురణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికలకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు వేగవంతం కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లలోని అన్ని వార్డుల పోలింగ్ స్టేషన్ వారీ ఓటరు జాబితాలను 2026 జనవరి 10న తుది జాబితా రూపంలో ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 30న ఈసీఐ పోలింగ్ స్టేషన్ డేటాను మున్సిపాలిటీ/కార్పొరేషన్ స్థాయిలో పునఃవ్యవస్థీకరిస్తారు.
• డిసెంబర్ 31న వార్డు వారీగా డేటా సర్దుబాటు చేస్తారు.
• జనవరి 1న డ్రాఫ్ట్ ఓటరు జాబితాలు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తారు.
• జనవరి 5న యూఎల్‌బీ స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు.
అనంతరం అభ్యంతరాల పరిశీలన పూర్తయ్యాక జనవరి 10న ఫోటోలతో కూడిన తుది ఓటరు జాబితాలు విడుదల చేయనున్నారు. వార్డుల వారీగా ఫోటో ఎలక్టోరల్ రోల్స్ తయారీ బాధ్యతను సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు. ఈ షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది.
ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి కీలకమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాను పరిశీలించి తమ వివరాలు సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. ఓటరు జాబితాల తుది ప్రచురణ అనంతరం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
